Cloudburst: ఉత్తరాఖండ్‌లో 'క్లౌడ్ బరస్ట్' 15 మంది మృతి ..16 మంది గల్లంతు

కొండచరియలు విరిగిపడి హిమాచల్‌లో ముగ్గురు దుర్మరణం

Update: 2025-09-17 00:50 GMT

ఉత్తరాఖండ్‌ శీతాకాల రాజధాని డెహ్రాడూన్‌, పరిసర జిల్లాల్లో సోమవారం మేఘ విస్ఫోటం కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తి 15 మంది మరణించగా మరో 16 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం సంభవించింది. సహస్త్రధారలో మంగళవారం వచ్చిన ఆకస్మిక వరదలకు హోటళ్లు, దుకాణాలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా వాణిజ్య సంస్థలు, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం జరిగింది. వరద ప్రవాహంలో పలువురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. డెహ్రాడూన్‌లోని మాల్‌దేవత, ముస్సోరీ నుంచి కూడా ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందుతున్నట్లు విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్‌ కుమార్‌ సుమన్‌ తెలిపారు.

ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాలలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లు, ఇళ్లు, దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఓ వంతెన కొట్టుకుపోయిందని ఆయన చెప్పారు. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు ఆయన తెలిపారు. బాధిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 300 నుంచి 400 మంది ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. టంకేశ్వర్‌లోని భగత్‌ సింగ్‌ కాలనీలో వరదల్లో నలుగురు వ్యక్తులు కొట్టుకుపోగా ముస్సోరీలో ఝరీపానీ టోల్‌ ప్లాజాపై కొండచరియ విరిగిపడి కార్మికుడు మరణించాడు

హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో ఈ వర్షాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. జిల్లాలోని నిహ్రీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక ఇంటిపై పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారని, మరో ఇద్దరిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయని జిల్లా ఎస్పీ సాక్షి వర్మ తెలిపారు. ఇక ధర్మపూర్ పట్టణంలోని బస్ స్టాండ్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. వరద ప్రవాహానికి 20కి పైగా ప్రభుత్వ బస్సులు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయని, సమీపంలోని వర్క్‌షాప్‌లు, పంప్ హౌస్‌లు, దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయని ఉప ముఖ్యమంత్రి ముఖేశ్ అగ్నిహోత్రి ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. అటు రాజధాని సిమ్లాలోనూ పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారులు మూసుకుపోయాయి.

Tags:    

Similar News