Pahalgam Terror Attack: భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు? ఎన్ఐఏ ఏం చెబుతోందంటే !
దక్షిణ కశ్మీర్‌లోనే పహల్గాం ఉగ్రవాదులు;
పహల్గామ్‌లో నరమేధం సృష్టించిన ముష్కరులు భారత్‌లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక అంచనాకు వచ్చింది. వారు పాకిస్థాన్‌కు వెళ్లలేదని.. ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్‌లోని ఒక దట్టమైన అడవిలో ఉన్నట్లుగా పేర్కొంది. ఒక పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులు తప్పించుకోగలిగారని తెలిపింది. ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం స్వయం సమృద్ధి కలిగి ఉన్నారని.. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చక్కగా అందుతున్నాయని.. స్థానికులు వారికి సపోర్ట్‌గా నిలిచినట్లుగా దర్యాప్తు సంస్థ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పట్టపగలు ఏకే 47 తుపాకులతో ముష్కరులు చెలరేగిపోయారు. హిందువులు టార్గెట్‌గా 26 మందిని టెర్రరిస్టులు కాల్చి చంపారు. పదులకొద్ది గాయపడ్డారు. అనంతరం ముష్కరులు దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయినట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రస్తుతం వారు ‘‘ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్’’ పరికరాలు ఉపయోగిస్తున్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది. దీంతో వారంతా సులువుగా తప్పించుకుంటున్నారని స్పష్టం చేసింది.
ఇక పహల్గామ్ దాడికి ముందు బైసారన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా అధికారులు ఆధారాలు సేకరించారు. రెక్కీ నిర్వహించి.. భారీగా జనం వచ్చాక అదునుచూసి ఎటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. నాలుగు ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. దాడి సమయంలో కూడా వారంతా ఉన్నట్లుగా కూడా కనిపెట్టింది. ప్రస్తుతం ఆ స్థానికుల సహకారంతోనే నలుగురు ఉగ్రవాదలు భారత్‌లో సేఫ్ జోన్‌లో ఉన్నట్లుగా గుర్తించారు.
అధునాతనమైన కమ్యూనికేషన్ పరికరాలు:
ఉగ్రవాదుల దగ్గర అధునాతనమైన కమ్యూనికేషన్ పరికరాలు ఉండడంతోనే తప్పించుకోగలుగుతున్నారని కాశ్మీర్‌లో పని చేసిన రిటైర్డ్ రక్షణ నిపుణుడు మేజర్ జనరల్ యస్ మోర్ మీడియాకు తెలియజేశారు. ఆ పరికరాలకు సిమ్ కార్డులతో పని లేదన్నారు. ఉగ్రదాడి సమయంలో మూడు ఉపగ్రహ ఫోన్‌లు ఉపయోగించారని.. ఈ ఫోన్లు కారణంగానే భద్రతా దళాలు వారి జాడ కనిపెట్టలేకపోయాయని భావిస్తున్నారు. ముగ్గురు మాత్రమే దాడిలో పాల్గొన్నారని.. ఇంకొకడు వీరికి సహాయం చేయడానికి మరొక చోట దాగి ఉన్నట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటు స్థానిక ఉగ్రవాదులు కూడా సమీపంలోనే నక్కి ఉండొచ్చని యస్ మోర్ అంచనా వేశారు.
ఎన్‌క్రిప్టెడ్ విశిష్టత ఇదే..
ప్రస్తుతం ఉగ్రవాదులు ఎన్‌క్రిప్టెడ్ అనే ఒక కమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ కనిపెట్టింది. ఇదొక భద్రతకు సంబంధించిన పరికరం. సమాచారాన్ని రహస్యంగా ఉంచుతుంది. ఇతరుల నుంచి రక్షణ కల్పిస్తుంటుంది. ఈ పరికరంతోనే ఉగ్రవాదులు సురక్షితంగా ఉన్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది.