Security breach in Parliament: పార్లమెంటులో అలజడిపై దర్యాప్తు వేగవంతం

రెక్కీ నిర్వహించి మరీ అలజడికి ప్రయత్నించినట్టు సమాచారం

Update: 2023-12-14 03:45 GMT

దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో చెలరేగిన తీవ్ర అలజడిపై దర్యాప్తు వేగవంతమైంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఏకంగా లోక్‌సభలోకి దూకిన ఘటనలో ప్రధాన సూత్రధారి ఇంకొకరు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి సూచనలతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. పటిష్ట భద్రత ఉండే పార్లమెంట్‌ వెలుపల రెక్కీ నిర్వహించి మరీ నిందితులు ఈ అలజడికి దిగారని తెలుస్తోంది.

మూడంచెల భద్రతను దాటి ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంట్‌లో ఇద్దరు వ్యక్తులు అలజడి రేపిన ఘటనలో ప్రధాన సూత్రధారి వేరే వ్యక్తి అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్లమెంట్‌ భద్రతను దాటేందుకు ఆ వ్యక్తే సూచనలు ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితులు ముందుగానే పార్లమెంటు వెలుపల పక్కాగా రెక్కీ నిర్వహించారని పోలీసులు నిర్ధారించారు. నిందితులందరూ భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరిట ఒక సోషల్‌ మీడియా పేజీ ఏర్పాటు చేసుకుని.... అందులో పరస్పరం మెసేజ్‌లు చేసుకుని లోక్‌సభలో కలకలం రేపారని ప్రాథమికంగా నిర్ధారించారు. వీరందరూ దాదాపు ఏడాదిన్నర క్రితం మైసూర్‌లో కలిశారని జూలైలో సాగర్ లఖ్‌నవూ నుంచి దిల్లీకి వచ్చారని పోలీసులు తెలిపారు.. అప్పుడు పార్లమెంట్‌లో ప్రవేశించేందుకు యత్నించినా వీలుకాలేదని తెలిపారు. డిసెంబర్ 10 న మరోసారి వీరు మరోసారి దిల్లీకి వచ్చారని వివరించారు. ఇండియా గేట్ సమావేశమైన వీరు రంగురంగుల గ్యాస్‌ క్యాన్లను సమకూర్చుకున్నారని పోలీసులు వెల్లడించారు. 


పార్లమెంటులో కలకలం సృష్టించేందుకు వీరు నెలరోజులుగా సమన్వయంతో పక్కా ప్రణాళికతో కుట్ర పన్నారని దిల్లీ పోలీసులు తెలిపారు. ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఈ దాడి చేశామని నిందితులు విచారణలో తెలిపారని పోలీసులు తెలిపారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, మణిపూర్ హింస వంటి సమస్యలతో తాము కలత చెందామని ఐదుగురు నిందితులు పోలీసులకు చెప్పినట్లు విచారణ వర్గాలు తెలిపాయి.

తాము ఏ సంస్థకు చెందినవారం కాదని విద్యార్థులమని తమ తల్లిదండ్రులు రైతులని కూడా విచారణలో నిందితులు చెప్పినట్లు వివరించారు. లోక్‌సభలో అలజడి రేపిన వారందరూ ఒకే భావజాలంతో ఉన్నారని... ప్రభుత్వానికి ఒక సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడి వెనక ఇంకెవరమైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

లోక్‌సభలో కలకలం రేపిన ఘటనపై దిల్లీ పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేశారు. దిల్లీ ఉగ్రవాద నిరోధక విభాగం కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది. మరోవైపు పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర విచారణకు ఆదేశించగా... సిబ్బంది దర్యాప్తును ప్రారంభించారు. లోక్‌సభ సెక్రటేరియట్ అభ్యర్థన మేరకు, పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనపై విచారణకు ఆదేశించామని CRPF డీజీ అనిష్ దయాల్ సింగ్ ఆధ్వర్యంలో ఇతర నిపుణులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 

Tags:    

Similar News