Parliament sessions: 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు

తీపి కబురు ఉండనుందా..?;

Update: 2025-01-19 03:00 GMT

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్‌ను సమర్పించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. సంప్రదాయం ప్రకారం జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రభుత్వం ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడుతుంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడతారు.

బడ్జెట్‌ తర్వాత ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ తీర్మానంపై ప్రధాని సమాధానంతో మొదటి విడత బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగియనున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి.

ఈసారి పార్లమెంట్ సెషన్ మధ్యలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలు వెలువడనుండటంతో ఈ సమావేశాలపై మరింత ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బడ్జెట్‌లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని.. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇక ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటికి పెద్దపీఠ వేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరలో బీహార్ ఎన్నికలు జరగనున్నందున, రెండు మిత్రపక్షాలు జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీ రెండూ రాష్ట్రానికి కీలకమైన ప్రకటనల కోసం ఆశిస్తున్నాయి.

అలాగే.. బడ్జెట్‌‎పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, రైతులు, కార్మికులు.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఎదురుచూస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News