Lok Sabha: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ప్రసంగంతో
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యమన్న ముర్ము
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ‘‘దేశ వ్యాప్తంగా 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించాం. 10 కోట్ల మందికి కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం. ప్రపంచంలో ధాన్యం ఉత్పత్తిలో భారతదేశం అగ్ర స్థానంలో ఉంది. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. 150కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.’’ అని ద్రౌపది ముర్ము అన్నారు.
‘‘ఇన్‌కమ్ ట్యాక్స్‌లో కీలక సంస్కరణలు తీసుకొచ్చాం. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించడంతో మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగింది. ఆధునిక టెక్నాలజీ పవర్ హౌస్‌గా భారత్‌ను మార్చుతున్నాం.. పీఎం సూర్యఘర్ యోజనతో సాధారణ ప్రజలు కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని పెంచాం.’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ‘జీ-రామ్-జీ’, ‘సర్’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు.. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.