Budget session: రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
కుంభమేళా తొక్కిసలాట బాధితులకు సంతాపం;
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవలే యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన మృతులకు సభ సంతాపం తెలిపింది. అంతేకాకుండా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు.
ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య రోజు తెల్లవారుజామున మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది మరణించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా 40 మంది వరకూ గాయపడినట్లు వెల్లడించింది. ఇక, భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (92) గతేడాది డిసెంబర్ 26న కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన తర్వాత ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సర్వే గత సంవత్సరంలో ప్రభుత్వం పనితీరుపై సమగ్ర విశ్లేషణను అందించే వివరణాత్మక రిపోర్ట్‌కార్డ్ లాంటిది. ఈ సర్వే జీడీపీ, వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి వంటి వివిధ కీలక విషయాల గురించి వివరిస్తుంది. ఇక రేపు అంటే శనివారం పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తారు.
కాగా, జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వక్ఫ్(సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లుతో పాటు వలస, విదేశీయుల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ నేపథ్యంలో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీల్లో మెజార్టీని ఉపయోగించి అజెండాను కేంద్రం బలవంతంగా రుద్దుతున్నదని విపక్షాలు ఆరోపించాయి.