Parliament: రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు
23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి;
సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలునుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరుగనున్న ఈ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. ముందు రోజు సోమవారం నాడు ఆమె ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందుకు తీసుకొస్తారు.
90 ఏండ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్-2024 బిల్లుతో సహా మొత్తం ఆరు బిల్లులను ప్రవేశపెట్టాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. పార్లమెంట్ సమావేశాల్లో నీట్ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత తదితర అంశాలపై ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరుగనున్నది.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ’లోని పలు సారాంశాలను ప్రస్తావిస్తూ రాజ్యసభ సెక్రటేరియట్ తాజాగా ఒక బులెటిన్ విడుదల చేసింది. సభాపతి రూలింగ్స్‌ను సభలో కానీ, సభ బయట కానీ ఎంపీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విమర్శించకూడదని పేర్కొన్నది. అదేవిధంగా వందే మాతరం, జై హింద్ సహా ఏ ఇతర నినాదాలు చేయకూదని గుర్తుచేసింది. సభలో ప్లకార్డులు ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. ఎగువ సభలోకి వచ్చే సమయంలో, సభ నుంచి వెళ్లే సమయంలో ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తల వంచి అభివాదం చేయాలంటూ రాజ్యసభ సభ్యుల కోసం రూపొందించిన హ్యాండ్ బుక్‌లోని నిబంధనలను మరోసారి గుర్తు చేసింది.
గత కొన్నేళ్లుగా శాసన ప్రక్రియ ద్వారా మీడియా రంగాన్ని నియంత్రించడానికి, పరిమితులు విధించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మీడియా స్వేచ్ఛ, సమాచార హక్కులను కాపాడుకోవడానికి మద్దతుగా నిలవాలని, ఈ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలని కోరుతూ లోక్‌సభలో విపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాసింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, ప్రసార సేవల నియ్రంతణ బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ యాక్ట్, ఐటీ రూల్స్-2021, ఆ తదుపరి సవరణలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తంచేసింది.