Parliament budget session: నేటి నుంచే బడ్జెట్‌ భేటీ

ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం;

Update: 2025-01-31 01:05 GMT

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ఇవి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశపెడతారు. శనివారం కేంద్ర బడ్జెట్‌ను ఆమె సభకు సమర్పిస్తారు. బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకూ జరుగుతాయి. తొలి విడత ఫిబ్రవరి 13వ తేదీ వరకూ, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ జరుగుతాయి. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం వరుసగా ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.

బడ్జెట్‌ సమావేశాల్లో పలు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశముంది. వక్ఫ్, ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్లుల వంటివి ఇందులో ఉన్నాయి. వక్ఫ్‌ బిల్లుపై నివేదికను స్పీకర్‌ ఓం బిర్లాకు గురువారం పార్లమెంటరీ కమిటీ అందజేసింది. దీంతో అది ఈ సమావేశాల్లోనే సభకు వచ్చే అవకాశముంది. కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లుల్లో ‘ద ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్స్‌ ఇన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆబ్జెక్ట్స్, త్రిభువన్‌ శాకరీ యూనివర్సిటీ, బ్యాంకింగ్, రైల్వేస్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఆయిల్‌ ఫీల్డ్స్, 2025 ఫైనాన్స్‌ బిల్లు ఉన్నాయి. గత సమావేశాల్లో పెండింగ్‌లో పడిపోయిన మరో 10 బిల్లులూ ఈసారి సభకు రానున్నాయి.

పార్లమెంటు సమావేశాల్లో పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. మహా కుంభమేళాలో తొక్కిసలాటపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండు చేయనున్నాయి. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో గురువారం అఖిల పక్ష సమావేశం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అధికార పార్టీకి చెందిన సభ్యులు ఎక్కువ మంది కమిటీల్లో ఉండటంవల్ల అవి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించాయి.  

Tags:    

Similar News