President Elections: రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం.. కూటమికి బీజేపీ కసరత్తు..
President Elections: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై అన్ని పార్టీలు చర్చలు, సమాలోచనలు చేస్తున్నాయి.;
President Elections: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై అన్ని పార్టీలు చర్చలు, సమాలోచనలు చేస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ ఓ అడుగు ముందే ఉంది. ఆగస్టులో జరుగే ఈ ఎన్నికలకోసం ఇప్పటినుంచే పావులు కదపడం ప్రారంభించింది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచే ఈ ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. బిహార్ సీఎం నితీశ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలపై వీరిద్దరి మధ్య సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఎన్డీయే పక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవర్ని రంగంలోకి దింపాలి? ఏయే సమీకరణాలను తెరపైకి తేవాలి? అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలను ఈ భేటీలో చర్చినట్లు తెలుస్తోంది. బీజేపీ, నితీశ్ మధ్య సరైన సంబంధాలు లేవని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను సీఎం నితీశ్ నుంచి ప్రారంభించడం విశేషం. అయితే.. సీఎం నితీశ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ మూడో వ్యక్తికి తెలియకుండానే జరిగింది.
బిహార్ నేతలకు సైతం ఈ సమావేశంపై సమాచారమూ లేదు. ఓ వ్యూహం ప్రకారమే ఇలా చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తమకు అనుకూలురైన పక్షాలతో సంప్రదింపులు కొనసాగుతూనే వుంటాయంటున్నారు బీజేపీ నేతలు. మరోవైపు బీజేడీ, వైసీపీ సహా ఇతర పార్టీలతో బీజేపీ నేతలుతో త్వరలో భేటీ కానున్నట్లు సమాచారం. వైసీపీ, బీజేడీలు బీజేపీ అభ్యర్ధికే మద్దతిచ్చే అవకాశం ఉంది.
అటు.. ప్రతిపక్ష పార్టీలు సైతం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటికే అంతర్గత చర్చలు, సమాలోచనలు చేస్తున్నాయి. ప్రధానంగా టీఎంసీ, ఆప్, టీఆర్‌ఎస్, ఎస్పీ నేతల మధ్య చర్చలు జరుపుతున్నారు. మరోవైపు.. విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని తమ పార్టీ నుంచి నిలబెట్టే యోచనలో కాంగ్రెస్ ఉంది. విపక్షాల మధ్య చీలిక రాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని.. ఇతర పార్టీలు ప్రతిపాదించినా మద్దతివ్వాలంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు.
మొత్తానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో బీజేపీ బరిలోకి దిగుతుండగా.. ప్రతిపక్ష పార్టీలు.. ఈ రెండు స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాలని అలోచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం 708గా ఉన్న ఎంపీల ఓటు విలువ.. జమ్మూకశ్మీర్ కారణంగా 700కి తగ్గే అవకాశం ఉంది. దీంతో ఈ సారి తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజార్టీ.. ఎన్డీయేకు సొంతంగా లేదు. కూటమికి కావాల్సిన ఓట్ల సంఖ్య తక్కువే. ఒక వేళ విపక్షాలు ఏకమైతే ఎన్టీయేకు కష్టమే. దీంతో ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు రసవత్తరంగా మారాయి.