AIR INDIA: విమానంలోనే మల,మూత్ర విసర్జన.. ప్రయాణికుడి అరెస్ట్
గాల్లో విమానంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన... ఫ్లోర్‌పైనే మల, మూత్ర విసర్జన.. అరెస్ట్ చేసిన పోలీసులు...;
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కొన్ని రోజులుగా తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. విమానయానంలో మూత్ర విసర్జన ఘటనలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ దిగ్గజ విమానయాన సంస్థ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ సంస్థకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు ఫ్లోర్‌పైనే మల, మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ముంబై- ఢిల్లీ విమానంలో ఈ ఘటన జరిగింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం ముంబై నుంచి దిల్లీ వెళ్లిన ఎయిర్ ఇండియా ఏఐసీ 866 విమానంలో రామ్ సింగ్ అనే వ్యక్తి ప్రయాణించాడు. అయితే, 17ఎఫ్ సీట్లో కూర్చున్న అతడు.. తొమ్మిదో వరుస వద్దకు వెళ్లి ఫ్లోర్‌పై ఉమ్మివేశాడు. ఆ తర్వాత మల, మూత్ర విసర్జన చేశాడు. రామ్ సింగ్ చేష్టలను గమనించిన క్యాబిన్ సిబ్బంది అతడిని మౌఖికంగా హెచ్చరించారు. అతడి అసభ్య ప్రవర్తనతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఇతర ప్రయాణికులకు దూరంగా అతడిని క్యాబిన్ సిబ్బంది ఐసోలేట్ చేశారు. అనంతరం పైలట్ ఇన్ కమాండ్‌కు సిబ్బంది సమాచారమందించారు. పైలట్ వెంటనే సంస్థ ఉన్నతాధికారులకు మెసేజ్ పంపించారు. విమానం ల్యాండ్ అవ్వగానే ఎయిరిండియా భద్రతా సిబ్బంది ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే, అతడు మద్యం మత్తులో ఇలా అనుచితంగా ప్రవర్తించాడా... లేదా అన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై ఎయిరిండియా ఓ ప్రకటన విడుదల చేసింది. ముంబై-ఢిల్లీ విమానంలో ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించి తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాడని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత విమానంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు తమ సిబ్బంది వేగంగా స్పందించి ప్రయాణికుడిని ఐసోలేట్ చేశారని ఎయిరిండియా వివరించింది. విమానం ల్యాండ్ అవ్వగానే సదరు వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారని.. పోలీసులు కేసు కూడా నమోదు చేశారని వివరించింది. ఇలాంటి వికృత, అభ్యంతరకర ప్రవర్తనను సహించబోమన్న ఎయిరిండియా... పోలీసుల దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. గతేడాది నవంబరులోనూ ఎయిరిండియా విమానంలో ఈ తరహా ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం ఆ ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై అటు డీజీసీఏ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎయిరిండియాకు జరిమానా విధించింది. ఆ తర్వాత కూడా పలుమార్లు ఈ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు వార్తల్లోకెక్కాయి. దీంతో ఎయిరిండియా చర్యలకు ఉపక్రమించింది. ప్రయాణికుల ప్రవర్తనా నియమావళిని కఠినతరం చేసింది.