Runway: ఫ్లైట్ డోర్ తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి..,ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
అప్రమత్తమైన సిబ్బంది.. విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్
వారణాసి నుంచి ముంబై వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని, అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో విమానం గంట ఆలస్యంగా బయల్దేరింది.
వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆకాశ ఎయిర్‌కు చెందిన ఫ్లైట్ క్యూపీ 1497 సోమవారం సాయంత్రం 6:45 గంటలకు ముంబైకి బయల్దేరాల్సి ఉంది. ప్రయాణికులందరూ విమానంలోకి ప్రవేశించిన తర్వాత, విమానం రన్‌వే వైపు వెళ్తుండగా (ట్యాక్సీయింగ్) ఈ ఘటన చోటుచేసుకుంది.
జౌన్‌పూర్ జిల్లా గౌరా బాద్‌షాపుర్‌కు చెందిన సుజిత్ సింగ్ అనే ప్రయాణికుడు ఉన్నట్టుండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు సమాచారం అందించి, విమానాన్ని తిరిగి ఏప్రాన్ వద్దకు తీసుకువచ్చారు.
అనంతరం భద్రతా సిబ్బంది విమానంలోకి ప్రవేశించి, ప్రయాణికులందరినీ కిందకు దించారు. సుజిత్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా "కేవలం ఆసక్తితోనే" ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించానని సుజిత్ సింగ్ చెప్పినట్లు ఫూల్‌పూర్ ఎస్‌హెచ్‌వో ప్రవీణ్ కుమార్ సింగ్ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. భద్రతాపరమైన తనిఖీల అనంతరం, విమానం రాత్రి 7:45 గంటలకు ముంబైకి బయల్దేరింది.