Modi-Congress: కాంగ్రెస్‌కు పాట్నా హైకోర్టు షాక్.. మోడీ, ఆయన తల్లి వీడియో డిలీట్ చేయాలని ఆదేశం
రాజకీయాల్లో ఇది ఆమోదయోగ్యం కాదని న్యాయస్థానం వ్యాఖ్య
ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు నాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇటీవల ప్రధాని మోడీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుపట్టినట్లుగా ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ మండిపడింది. హైకోర్టులో పిటిషన్ వేసింది.
బుధవారం విచారించిన పాట్నా హైకోర్టు.. సోషల్ మీడియా నుంచి మోడీ, ఆయన తల్లికి సంబంధించిన ఏఐ వీడియోను తొలగించాలని చీఫ్ జస్టిస్ పీబీ బజంత్రీ కాంగ్రెస్ పార్టీని ఆదేశించారు. అన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి తక్షణమే తొలగించాలని సూచించింది.
ప్రస్తుతం బీహార్‌లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలు మాటలు-తూటాలు పేల్చుకుంటున్నారు. ఓట్ల చోరీ జరుగుతుందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కై ఓట్ల చోరీ చేస్తుందంటూ దుమ్మెత్తిపోశారు. ఇందులో భాగంగానే బీహార్ కాంగ్రెస్ ఒక ఏఐ వీడియోను రూపొందించింది.
వీడియోలో మోడీని పోలిన పాత్ర రాత్రికి తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోతుండగా.. ‘‘నేను ఈరోజు ఓటు చోరీతో ముగించాను. ఇక ఇప్పుడు బాగా నిద్రపోవచ్చు.’’ అంటూ అనుకుంటాడు. ఇంతలో కలలో తల్లి హీరాబెన్ ప్రత్యక్షమై.. తన పేరు ఉపయోగించి ఓట్లు దొంగిలించడానికి రాజకీయాల్లోకి వచ్చినందుకు తిడుతుంది. ఈ సందర్భంగా మోడీని పోలిన పాత్రను మందలించి.. నువ్వు ఎంతవరకు తగ్గడానికి సిద్ధంగా ఉన్నావు?’’ అనగానే ఆశ్చర్యపోయి మేల్కొంటాడు. ఈ వీడియోలో ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే బీహార్ కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఇక కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ అన్ని హద్దులు దాటిపోయిందని.. రాహుల్ గాంధీ అహంకారానికి ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తింది. చనిపోయిన తల్లిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి అసహ్యకరమైన పనులు చేస్తారా? అంటూ నిలదీసింది. గతంలో చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా.. సమర్థించుకోవడానికి మరొక వీడియో చేస్తారా? అంటూ మండిపడింది.