Pegasus: పార్లమెంట్ సమావేశాలను కుదిపేసిన పెగాసస్ వ్యవహారం.. మరోసారి..
Pegasus: గతేడాది యావత్ దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.;
Pegasus: గతేడాది యావత్ దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిందని.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా.. క్షిపణులతో పాటు పెగాసస్‌కు కూడా డీల్ కుదురినట్లు తెలిపింది. పెగాసస్ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌వోతో తమకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని.. కేంద్రం చెబుతున్న నేపథ్యంలో తాజా కథనం సంచలనాత్మకంగా మారింది.
పెగాసస్ వ్యవహారంపై ఏడాది పాటు దర్యాప్తు జరిపి ఈ కథనం ఇస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ.. గత 10ఏళ్లుగా నిఘా సాఫ్ట్‌వేర్‌లను సబ్‌స్క్రిప్షన్ విధానంలో.. చట్టసభలు, నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు కూడా ఈ స్పైవేర్‌ను విక్రయించింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి.
2017 జులైలో మోడీ తొలిసారిగా ఇజ్రాయెల్ వెళ్లారు. ఓ భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం అదే తొలిసారి. ఆ సమయంలోనే ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాలు, సాంకేతిక మార్పిడి కోసం.. 2 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదురింది. ఈ డీల్‌లోనే క్షిపణి వ్యవస్థతో పాటు పెగాసస్ కూడా ఉంది అన్నది న్యూయార్క్ టైమ్స్ కథనం.
ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భారత్‌లో పర్యటించారు. 2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు అబ్జర్వర్ హోదాపై జరిగిన ఓటింగ్‌లో.. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఓటు వేసింది భారత్. ఇవన్నీ ఈ డీల్ లైన్‌లోనే జరిగాయంటోంది న్యూయార్క్ టైమ్స్.
పెగాసస్ స్పైవేర్‌ను కొన్ని దేశాలు వినియోగించుకుని.. రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు గతేడాది జులైలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇండియాలో రాహుల్‌గాంధీ సహా రాజకీయ ప్రముఖులు, జడ్జిలు ఇలా 300మంది ఫోన్లను హ్యాక్ చేశారని.. 'ది వైర్' సంచలనం రేపింది.
అప్పట్లో ఈ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేసింది. దీనిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కథనం మరోసారి అగ్గిరాజేస్తోంది. ఇది దేశ ద్రోహంతో సమానమని రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు అంతా విమర్శిస్తున్నారు. రక్షణ కోసం కాకుండా విపక్షాలపై నిఘా పెట్టడానికి స్పైవేర్‌ను వినియోగించడం బీజేపీకే చెల్లుతుందని.. శివసేన మండిపడుతోంది.