EPFO: ఈపీఎఫ్ఓ శుభవార్త... ఇక 100 శాతం పీఎఫ్‌ను తీసుకోవచ్చు!
చదువుకు పదిసార్లు, వివాహం కోసం 5సార్లు వరకు పాక్షిక ఉపసంహరణకు వెసులుబాటు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ విషయంలో నిబంధనలను సరళతరం చేయడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా పీఎఫ్ నిధిలో ఉపసంహరించుకోగల బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు తీసుకోవచ్చు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో సమావేశమైన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది.పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన 13 సంక్లిష్టమైన నిబంధనలను ఒకే నిబంధనగా క్రమబద్ధీకరించింది. ముఖ్యమైన అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది. ముఖ్యమైన అవసరాల్లో అనారోగ్యం, విద్య, వివాహం ఉన్నాయి.
ఉపసంహరణల సంఖ్యను కూడా పెంచింది. చదువుల కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండింటికి మూడుసార్లకే అనుమతి ఉంది. గతంలో ప్రత్యేక పరిస్థితుల ఆప్షన్‌లో కారణం చెప్పాల్సి ఉండేది. నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, సంస్థల మూసివేత వంటి కారణాలు చూపాల్సి ఉండేది. ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పవలసిన అవసరం లేదు.
తాజా నిబంధనల ప్రకారం, సభ్యుడు అన్ని వేళలా కనీస బ్యాలన్స్‌ను మెయింటెయిన్ చేయాలి. సభ్యుని ఖాతాలో కంట్రిబ్యూషన్లలో 25 శాతాన్ని మినిమం బ్యాలెన్స్‌గా కేటాయించాలి. దీనివల్ల సభ్యుడు ఈపీఎఫ్‌ఓ అందించే అత్యధిక వడ్డీ రేటును పొందడానికి వీలవుతుంది. దాంతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. నిబంధనలు సరళంగా ఉండటంతోపాటు ఉద్యోగులకు సానుకూలంగా ఉండటం, డాక్యుమెంటేషన్ అవసరం లేకపోవడం వల్ల పాక్షిక విత్‌డ్రాయల్ కోసం క్లెయిములు నూటికి నూరు శాతం పరిష్కారమవడానికి మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ ప్రీమెచ్యూర్ ఫైనల్ సెటిల్మెంట్‌కు రెండు నెలల గడువు ఉంది. దీనిని 12 నెలలకు పెంచారు. ఫైనల్ పెన్షన్ విత్‌డ్రాయల్ పీరియడ్‌ను రెండు నెలల నుంచి 36 నెలలకు పెంచారు. పాక్షిక విత్‌డ్రాయల్స్ నిబంధనలను సరళతరం చేయడం వల్ల సభ్యులు తమ రిటైర్‌మెంట్ సేవింగ్స్ లేదా పెన్షన్ హక్కులకు విఘాతం కలగకుండా తమ తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతారు. కోర్టు వివాదాలను తగ్గించడం కోసం విశ్వాస్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు.