కేరళ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో అయ్యప్ప దర్శనానికి కేరళ, తమిళనాడు సహా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 25 లక్షల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
గతేడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాది ఈ సమయానికి సుమారు 21 లక్షల మంది భక్తులు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుత సీజన్‌లో ఆ సంఖ్య 25 లక్షలు దాటినట్లు శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఎడీజీపీ ఎస్ శ్రీజిత్ తెలిపారు. డిసెంబర్ చివరినాటికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనాలు సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.