PM Kisan : రైతులకు షాకింగ్ న్యూస్.. పీఎం కిసాన్ యోజన నుంచి లక్షలాది మంది పేర్లు తొలగింపు ఎందుకంటే?
PM Kisan : దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ షాకింగ్ న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వివిధ ప్రచారం అవుతున్న సమాచారం గందరగోళానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం స్వయంగా కీలక అప్‌డేట్‌ను ఇచ్చింది. కేంద్రం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ముఖ్యమైన నోటీస్‌ను జారీ చేసింది. ఈ నోటీస్‌లో పథకానికి అర్హులు ఎవరు, లక్షలాది మంది రైతుల పేర్లను తాత్కాలికంగా ఎందుకు తొలగించారు అనే విషయాలను ప్రభుత్వం స్పష్టం చేసింది.
పీఎం కిసాన్ యోజన అమలులో పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. అర్హులు కాని లక్షలాది మంది రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తాత్కాలికంగా తొలగించింది. చాలా మంది రైతులు పథకం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయకపోవడం, అలాగే అనర్హులు అయినప్పటికీ లబ్ధి పొందడం గుర్తించారు.
ఈ పథకం కింద ఒక కుటుంబంలో (భార్య, భర్త, మైనర్ పిల్లలు) ఒక్కరికి మాత్రమే ప్రయోజనం పొందడానికి అర్హత ఉంది. అయితే, అనేక కుటుంబాల్లో భార్యాభర్తలు లేదా మైనర్ పిల్లలు కూడా విడివిడిగా దరఖాస్తు చేసి లబ్ధి పొందుతున్నట్లు తనిఖీల్లో తేలింది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత ఎవరైతే కొత్తగా భూమిని కొనుగోలు చేశారో, వారికి కూడా ఈ పథకం ప్రయోజనం వర్తించదు.
లబ్ధిదారుల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన రైతులందరికీ ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఎవరి పేర్లు అయితే జాబితా నుంచి తొలగించబడ్డాయో, వారికి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని ప్రభుత్వం నోటీస్‌లో పేర్కొంది. ఈ తనిఖీ తర్వాత, నిజంగా అర్హులుగా తేలిన రైతుల పేర్లను తిరిగి లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. అయితే, అనర్హులుగా నిర్ధారించబడిన రైతులు ఇకపై ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు.
ఈ చర్య ద్వారా పథకం అమలులో పారదర్శకతను పెంచాలని, అసలైన రైతులకు ప్రయోజనం అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నకిలీ లేదా అనర్హులైన వ్యక్తులు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయకుండా అరికట్టడానికి ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
మీ స్టేటస్ ఎలా తనిఖీ చేసుకోవాలి?
రైతులు ఎటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా, తమ అర్హత స్టేటస్ స్వయంగా తనిఖీ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in ను సందర్శించాలి. ఎలిజిబిలిటీ స్టేటస్ (Eligibility Status): మీరు పథకానికి అర్హులా కాదా అని తెలుసుకోవచ్చు. నో యువర్ స్టేటస్ (KYS - Know Your Status) విభాగంలో, మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఇంకా ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు.
21వ విడతపై అప్‌డేట్
పీఎం కిసాన్ యోజన 21వ విడత విడుదల తేదీపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నవంబర్ 14న రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.