PM Modi: కలిసి పనిచేద్దామంటూ ట్రంప్‌నకు ఫోన్ చేసిన భారత ప్రధాని
ప్రపంచ దేశాల నుంచి కూడా అభినందన సందేశాలు;
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌ను ప్రపంచ దేశాలు అభినందనల్లో ముంచెత్తాయి. ఆయనతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి. అగ్రరాజ్యంతో నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమని రష్యా తెలిపింది. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రపంచశాంతి కోసం తామిద్దరం కలిసి పనిచేద్దామని నాయకులిద్దరూ అనుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా కాంగ్రెషనల్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయానికి కూడా ట్రంప్‌ను మోదీ అభినందించారు. ‘‘మా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మంచి సంభాషణ జరిగింది. అద్భుతమైన విజయం సాధించినందుకు ఆయనను అభినందించాను. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, ఇతర రంగాల్లో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ట్రంప్‌తో కలిసి మళ్లీ సన్నిహితంగా పనిచేయాలని చూస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ఆ తర్వాత ఎక్స్‌లో తెలిపారు.
దిమిత్రీ పెస్కోవ్, క్రెమ్లిన్ అధికార ప్రతినిధి
అమెరికా మాకెప్పుడూ విరోధి దేశమే. ఆ దేశంతో నిర్మాణాత్మక చర్చలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధమే. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక చర్చలపై అమెరికా వైఖరి ఎలా ఉంటుందనే స్పష్టత వస్తుంది. న్యాయం, సమానత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడిన చర్చలకు తాను సిద్ధమని పుతిన్ పలుమార్లు చెప్పారు. దానికి ఆయన కట్టుబడి ఉన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంకా క్షీణించిపోవడం అసాధ్యం. ఎందుకంటే చరిత్రలో అత్యంత అధమ స్థాయికి ఇప్పటికే అవి చేరుకున్నాయి.
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్
అమెరికా ప్రజల ఎంపికను గౌరవిస్తాం. అమెరికాతో శాంతియుత సంబంధాలు కొనసాగించడంపై ఆశాభావం ఉంది. పరస్పర గౌరవం, సహకార సూత్రాల ఆధారంగా చైనా-అమెరికా సంబంధాలను కొనసాగిస్తాం.
బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని
అతిపెద్ద విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన ప్రియమైన డొనాల్డ్ ట్రంప్, మెలనియాలకు అభినందనలు. శ్వేతసౌధానికి మీ పునరాగమనం అమెరికాకు కొత్త శకాన్ని అందిస్తుంది. ఇజ్రాయెల్-అమెరికా మధ్య శక్తిమంతమైన సంబంధాలకు దోహదం చేస్తుంది.