PM Modi: ఆపరేషన్ సింధూర్ భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చింది..
మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ;
ఆపరేషన్ సింధూర్ చేపట్టి మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం మన్‌కీ బాత్ 122వ ఎపిసోడ్‌లో మోదీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత మోదీ మన్‌కీ బాత్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి.
ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని ప్రధాని అన్నారు. మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని చెప్పారు. దేశ ప్రజలను ఆపరేషన్ సింధూర్ ఎంతగానో ప్రభావితం చేసిందని, అనేక కుటుంబాలు దీనిని తమ జీవితాల్లో భాగం చేసుకున్నాయని తెలిపారు. ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సింధూర్ అని పేర్లు పెట్టుకున్నారని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని, నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నాడని ఆయన అన్నారు.
ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు. అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు తిరంగా యాత్రలు నిర్వహించారని చెప్పారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారని తెలిపారు. అదేవిధంగా దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు.
నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం ఇకపై కొనసాగుతుందని ప్రధాని స్పష్టంచేశారు. నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధించామన్నారు. తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి కూడా ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ఆయన ప్రశంసించారు.