MODI: అవినీతి ప్రోత్సాహానికే "ప్రతిపక్షాల కూటమి"

పోర్ట్‌బ్లెయిర్‌లో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని... ప్రతిపక్షాల భేటీపై విమర్శలు.. స్వార్థపూరిత పార్టీలని ఎద్దేవా....

Update: 2023-07-18 06:45 GMT

అవినీతిని ప్రోత్సహించేందుకే ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని ప్రధాని మోదీ‍(PM Modi) చురకలంటించారు. ప్రతిపక్షాల నినాదం "కుటుంబం- మా కోసం" అని ఎద్దేవా చేశారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్‌(Port Blair)లోని వీర్‌ సావర్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Veer Savarkar International Airport)లోని కొత్త ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనాన్ని(NIBT)ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్(video conferencing) ద్వారా ప్రారంభించారు. దాదాపు 710 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మరింత కనెక్టివిటీని పెంచనుంది. 40,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనం ఏటా 50 లక్షల మంది ప్రయాణికులను రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దారు. పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.80 కోట్లతో రెండు బోయింగ్-767-400, రెండు ఎయిర్‌బస్-321 రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనువైన ఆప్రాన్‌ను కూడా నిర్మించారు. ఈ నిర్మాణాలతో ఈ విమానాశ్రయం ఇప్పుడు ఒకేసారి పది విమానాలు పార్కింగ్ చేయడానికి అనుకూలంగా మారింది.


అనంతరం మాట్లాడిన మోదీ... ప్రతిపక్షాల సమావేశంలో విమర్శనాస్త్రాలు సంధించారు. తమిళనాడులో అవినీతి కేసులు ఉన్న డీఎంకే(DMK‌)కు ప్రతిపక్షాలు క్లీన్‌చిట్‌ ఇచ్చాయని... బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస గురించి అసలు మాట్లాడడం లేదని ప్రధాని(Prime Minister Narendra Modi) విమర్శించారు. యూపీఏ హయాంలో చేసిన తప్పులను తాము సరిదిద్దామని అన్నారు. కాంగ్రెస్(CONGRESS), లెఫ్ట్ పార్టీలు స్వార్ధ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. వంశపారంపర్య పార్టీలు ఎప్పుడూ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న మోదీ.. ప్రతిపక్షాలకు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమన్నారు.


తమ ప్రభుత్వం గత 9 సంవత్సరాలలో అండమాన్ అభివృద్ధికి రూ. 48,000 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఖర్చు చేసిన దాని కంటే ఇది రెండింతలు ఎక్కువన్నారు. 2014 నుంచి అండమాన్‌కు పర్యాటకుల సంఖ్య రెట్టింపైందన్న మోదీ.. రాబోయే సంవత్సరాల్లో ఇది అనేక రెట్లు పెరుగుతుందన్నారు.

అంతకుముందు పోర్ట్ బ్లెయిర్‌లో వినాయక్ దామోదర్ సావర్కర్ విగ్రహాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Civil Aviation Minister Jyotiraditya Scindia) ఆవిష్కరించారు. వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలతో కనెక్టివిటీని కలిగి ఉందని, దీనిని మరింత విస్తరిస్తామని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News