Narendra Modi: యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్న నరేంద్ర మోదీ
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ నాంది అన్న ప్రధాని;
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి భారత్ పునాది బలోపేతానికి గ్యారంటీ ఇవ‌్వనుందని...ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అభివృద్ధి భారత్‌కు చెందిన నాలుగు స్తంభాలైన యువత, మహిళలు, రైతులు, పేదలకు ఈ బడ్జెట్ సాధికారత కల్పించనుందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంతోపాటు యువత ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. పరిశోధన, నూతన ఆవిష్కరణలకు లక్ష కోట్లు కేటాయించినట్లు తెలిపారు. చారిత్రక బడ్జెట్ అంకుర పరిశ్రమలకు రాయితీలు ప్రకటించినట్లు చెప్పారు. ద్రవ్యలోటును అదుపులో ఉంచుతూనే 11.11లక్షలకోట్ల భారీ మూలధన వ్యయానికి కేటాయింపులు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ బడ్జెట్ పేదలు, మధ్య తరగతి వర్గాలకు సాధికారత కల్పించటమే కాకుండా యువతకు లెక్కకు మించిన ఉపాధి అవకాశాలు కల్పించనుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్‌కు మూలస్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారతకు ఈ బడ్జెట్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అని కొనియాడారు. ఈ బడ్జెట్ నిర్ణయాలు 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా యువతకు ఎన్నో కొత్త కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు దారితీస్తాయని పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ఈ దిశగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ. 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేయడం, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపును పెంచడం జరిగిందన్నారు.