PM Modi: అబ్దుల్ కలాం ఆలోచనలు యువతకు స్ఫూర్తిదాయకం..
మిస్సైల్ మ్యాన్‌కు మోదీ నివాళి..!;
మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలా వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. కలాం గొప్ప శాస్త్రవేత్త, మార్గదర్శి, నిజమైన దేశభక్తుడని ప్రధాని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు ఇప్పటికీ దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. బలమైన, అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడానికి దోహదపడేలా వారిని ప్రోత్సహిస్తాయన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ఆయనను స్ఫూర్తిదాయకమైన దార్శనికుడని, జాతి పట్ల ఆయన అంకితభావం ఆదర్శప్రాయమైందన్నారు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజల నుంచి అపారమైన గౌరవం పొందిన దేశాధ్యక్షుల్లో ఆయన ఒకరు. ఆయన సాధారణ జీవితాన్ని గడిపారు. శాస్త్రవేత్తగా ఆయన భారతదేశ రక్షణ పరిశోధన, మిస్సైల్ కార్యక్రమాలను కొత్త శిఖరాలను తీసుకెళ్లారు. డాక్టర్ కలాం ఆలోచనలను యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కలాం ఆలోచనలు, జీవిత తత్వశాస్త్రం దేశంలోని యువత మెరుగైన పౌరులుగా మార్చేందుకు, జాతి నిర్మాణంలో పాల్గొనేందుకు నిరంతరం ప్రేరణగా నిలుస్తాయన్నారు. 2020 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది కలాం కల అని, ఆ దిశగా ముందుకు సాగడం మన కర్తవ్యమని కూడా మోదీ అన్నారు. డాక్టర్ కలాం వర్ధంతి సందర్భంగా యావత్ దేశం ఆయనకు నివాళులర్పిస్తున్నది. 2015 జులై 27న షిల్లాంగ్‌లో ఉపన్యాసం చేస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.