PM Modi: రాముడి స్ఫూర్తితోనే 'ఆపరేషన్ సిందూర్'..

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ లేఖ

Update: 2025-10-21 06:30 GMT

దీపావళి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ విడుదల చేశారు. శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టడం నేర్పినట్టే, అన్యాయంపై పోరాడే స్ఫూర్తిని కూడా ఇస్తారని ఆయన పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన 'ఆపరేషన్ సిందూర్' ఇందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని మోదీ వ్యాఖ్యానించారు.

ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన గౌరవాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా జరిగిన అన్యాయానికి ప్రతీకారం కూడా తీర్చుకుందని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమయ్యాక ఇది రెండో దీపావళి అని ప్రధాని గుర్తుచేశారు.

ఈ దీపావళి చాలా ప్రత్యేకమైనదని ప్రధాని అభివర్ణించారు. దేశంలోని మారుమూల జిల్లాలతో సహా అనేక ప్రాంతాల్లో తొలిసారిగా దీపాలు వెలుగుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదంతో అట్టుడికిన ఈ ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా మారాయని అన్నారు. హింసా మార్గాన్ని వీడిన ఎందరో మన రాజ్యాంగంపై విశ్వాసంతో అభివృద్ధి స్రవంతిలో కలుస్తున్నారని, ఇది దేశానికి గొప్ప విజయమని మోదీ పేర్కొన్నారు.

ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణలను కూడా మోదీ ప్రస్తావించారు. నవరాత్రుల తొలి రోజు నుంచే తగ్గిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయని, 'జీఎస్టీ బచత్ ఉత్సవ్' ద్వారా ప్రజలు వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. పలు సంక్షోభాలతో ప్రపంచం అస్థిరంగా ఉన్నప్పటికీ, భారత్ స్థిరత్వానికి చిహ్నంగా నిలిచిందన్నారు. సమీప భవిష్యత్తులోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

'వికసిత్ భారత్', 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో పౌరులుగా మన బాధ్యతలను నిర్వర్తించాలని మోదీ పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులను స్వీకరించి, 'ఇది స్వదేశీ!' అని గర్వంగా చెప్పుకోవాలని సూచించారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తిని పెంపొందించాలని, అన్ని భాషలను గౌరవించాలని, పరిశుభ్రత పాటించాలని కోరారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ఆహారంలో నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించుకుని, యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని హితవు పలికారు.

ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినప్పుడు దాని కాంతి తగ్గదని, ఇంకా పెరుగుతుందని దీపావళి మనకు నేర్పుతుందని మోదీ అన్నారు. అదే స్ఫూర్తితో సమాజంలో సామరస్యం, సహకారం, సానుకూలత అనే దీపాలను వెలిగిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News