Indian Railway: రేపు ఒకేసారి 508 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని శంకుస్థాపన
ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన;
దేశంలో రద్దీ ఎక్కువగా ఉండే రైల్వేస్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో కేంద్రం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా....ఈనెల 6న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం రూ.24,470 కోట్లను వెచ్చించనున్నారు.
అందులో ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్ లో 55, బిహార్ 49, మహారాష్ట్ర 44, పశ్చిమ బంగాల్ 37, మధ్యప్రదేశ్ 34, అసోం 32, ఒడిశా 25, పంజాబ్ 22, గుజరాత్ , తెలంగాణ 21, ఝార్ఖండ్ 20, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు 18, హరియాణా 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వేస్టేషన్లను 24వేల 4వందల 70 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయనున్నారు. నగరానికి ఇరువైపులా అనుసంధానం చేస్తూ.ఆయా స్టేషన్లను సిటీ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో సహా రైల్వేస్టేషన్ కేంద్రంగా నగరాభివృద్ధి జరుగుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. రైల్వేస్టేషన్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించడమే అభివృద్ధి పనుల లక్ష్యమని పీఎంవో వెల్లడించింది.
ఆధునిక అవసరాలు, ప్రస్తుత ప్రజల అవసరాలకు అనుగుణంగా హైటెక్ హంగులతో, సకల సౌకర్యాలతో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నారు. అందుకు సంబంధించిన కొన్ని స్టేషన్ల నమూనా ఫొటోలను కూడా విడుదలజేశారు. వాటి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. సిటీ సెంటర్లలో ఉన్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. నగరానికి రెండు వైపులా ఉండే విధంగా స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నారు. స్టేషన్ భవనాన్ని పునరాభివృద్ధి చేస్తారు. ఆధునిక ప్రయాణికులకు అనుగుణంగా అన్ని రకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తారు. స్టేషన్లలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం విరివిగా మొక్కలు నాటుతారు. ఈ మేరకు అన్ని అమృత్ భారత్ స్టేషన్లలో ల్యాండ్‌స్కేప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే జీఎం పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం వరకు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. అయితే ఆధునీకరించే రైల్వే స్టేషన్ల ఫ్లాట్ ఫాం టికెట్ ధరలపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
మొదటి దశ పూర్తైన తర్వాత రెండో దశలో మిగతా స్టేషన్లను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 6వ తేదీన, ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాప చేస్తారు. వివిధ రైల్వే స్టేషన్స్‌లో జరగనున్న శంకుస్థాపన పనులకు ఆయా రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.