PM Modi: ఈనెల 29న ఢిల్లీలో ఎన్నికల శంఖారావం మోడీ

పరివర్తన్ ర్యాలీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభం;

Update: 2024-12-28 01:45 GMT

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార ఆప్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. కేజ్రీవాల్ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అలాగే అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. అంతేకాకుండా ఉచిత హామీలు కూడా ప్రకటిస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా సన్నద్ధమవుతోంది. అయితే ఈసారి ఢిల్లీలో అధికారాన్ని ఛేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న హస్తినలో ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పరివర్తన్ ర్యాలీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం కాలం ఫిబ్రవరితో ముగుస్తోంది. దీంతో వచ్చే నెలలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 6న ఓటర్ల తుది జాబితాను కేంద్రం ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అనంతరం ఏదొక సమయంలో ఎన్ని్కల షెడ్యూల్ విడుదల చేయొచ్చని తెలుస్తోంది. జనవరి నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయొచ్చని సమాచారం. అందుకోసమే ప్రధాన పార్టీలు రెడీ అయిపోతున్నాయి.

ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉన్న ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సింగిల్‌గానే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా ఇటీవలే ఆప్‌ పరిపాలనపై కాంగ్రెస్ వైట్ పేపర్ విడుదల చేసింది. హామీల అమల్లో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ అయితే.. ఆప్‌తో పొత్తు పెద్ద పొరపాటు అని అభివర్ణించారు. ఇక బీజేపీ కూడా ఇప్పటికే ఆయా కమిటీలను ఏర్పాటు చేసింది. ఇలా మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News