PM Modi: నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ

రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్న అమిత్ షా

Update: 2025-12-08 03:00 GMT

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 1 న ప్రారంభమైన సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. ఇక సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రధాని మోడీ ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్‌లో చర్చ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ‘వందేమాతరం’లోని అనేక ముఖ్యమైన విషయాలను హైలైట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 1937లో వందేమాతం గీతంలోని కీలకమైన చరణాలను తొలగించిందని.. విభజనకు బీజాలు వేసిందని ఆరోపించారు. తాజాగా మరోసారి లోక్‌సభ వేదికగా హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది.

పార్లమెంట్‌లో ‘వందేమాతరం’పై 10 గంటలు చర్చకు కేటాయించబడింది. ప్రధాని మోడీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించనున్నారు. అనంతరం గౌరవ్ గొగోయ్, ప్రయాంకాగాంధీతో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రసంగించనున్నారు. ఇక రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభించనున్నారు.

వందేమాతం గీతాన్ని బంకిం చంద్ర ఛటర్జీ రాశారు. నవంబర్ 7, 1875లో బంగదర్శన్‌లో మొదటిసారిగా ప్రచురించబడింది. 1905లో బెంగాల్‌లో జరిగిన విభజన వ్యతిరేక ఆందోళన సమయంలో ఈ గీతాన్ని రాజకీయంగా ఉపయోగించారు. అనంతరం ఈ గీతం దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధులను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ఇక ఈ గీతాన్ని జనవరి 24, 1950లో జాతీయ గీతంగా పరిగణించింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ వార్షికోత్సవం నిర్వహించింది. ఏడాది పొడవునా వందేమాతరం వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పార్లమెంట్‌లో ‘SIR’ పై ఆందోళనలు జరుగుతున్నాయి. విపక్ష ఎంపీలంతా నిరసనలు నిర్వహిస్తున్నారు. తక్షణమే ‘సర్‌’ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్‌లో ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభిస్తున్నారు. చర్చ ముందుకు సాగుతుందా? లేదంటే నిరసనలు కొనసాగతాయా? అన్నది చూడాలి.

Tags:    

Similar News