శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఉదయం 9గంటల 45నిమిషాలకు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అవుతారు. అయితే అధికారిక పర్యటనకు వస్తున్న మోదీకి ఈ సారైనా సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారా? లేదా గతంలో మాదిరిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2022 ఫిబ్రవరి నుంచి రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ రిసీవ్ చేసుకోవడం లేదు. చెప్పాలంటే.. గతంలో మోదీ భారత్ బయోటెక్‌ను సందర్శించిన సమయంలో కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రానవసరం లేదంటూ ప్రధాని కార్యాలయం.. తెలంగాణ CMOకి లేఖ పంపారు. ఇక అప్పటి నుంచి ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణ, ఇక్రిశాట్ కార్యక్రమానికి ప్రధాని వచ్చిన సమయంలోనూ కేసీఆర్ డుమ్మా కొట్టారు.
శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోదీ.. కాజీపేట వ్యాగన్ ఓవరాలింగ్ యూనిట్‌తో పాటు పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 6వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ చేపట్టనున్నారు. అయితే ఇది అధికారిక పర్యటన కావడంతో ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం ఉన్నా.., ఆయన వెళ్లే అవకాశాలు లేవని CMO వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేదు. ధాన్యం కొనుగోలు అంశం నుంచి విభజన హామీల వరకు కేంద్రం తీరును బీఆర్ఎస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. పైగా రాష్ట్రానికి వచ్చిన ప్రతీసారి రాష్ట్ర బీజేపీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే వరంగల్‌లోనూ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. అందువల్లే సీఎం కేసీఆర్ మోదీకి ఆహ్వానం పలకడం లేదన్న వాదనను బీఆర్ఎస్ తీసుకొస్తోంది.
ఇక ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న వాదనను కాంగ్రెస్ బలంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్, మోదీ ఒకే వేదిక పంచుకుంటే నష్టమనే చర్చ పార్టీలో జరుగుతుంది. మరోవైపు మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ పాటించడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధాని రాక సందర్భంగా స్వయంగా కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం లేదని ప్రోటోకాల్ పాటించడానికి మంత్రులు వెళ్తే సరిపోతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లుండి తెలంగాణ పర్యటకు వస్తున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారో లేదో అన్న అంశం ఆసక్తి రేపుతోంది.