కేరళలో వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీ ( Narendra Modi ) పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు. వయనాడ్ జిల్లాలోని చూరల్మల, ముండక్క గ్రామాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ ఘోర విపత్తులో చనిపోయిన వారి సంఖ్య 413కి చేరింది. మరో 152 మంది ఆచూకీ తెలియాల్సివుంది.
బాధితుల కోసం సహాయక బృందాల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 10 వేల మందికి పైగా బాధితులు ఉపశమన కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికే విపక్ష నేత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వయనాడ్ కు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
విషాదాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాహుల్ గాంధీ, కేరళ ప్రభుత్వ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతీయ విపత్తుపై స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు.