PM Modi: పార్లమెంట్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ మూవీ చూసిన మోడీ

ఇదో ప్రత్యేక అనుభూతి అంటున్న విక్రాంత్‌ మాస్సే;

Update: 2024-12-03 00:15 GMT

ప్రధాని మోడీ సోమవారం పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ చిత్రాన్ని వీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎంపీలు, నటీనటులతో కలిసి ప్రధాని సినిమా చూశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా చిత్ర బృందం వీడియోలో ప్రత్యేకంగా కనిపించారు. ఆడిటోరియంలోకి వెళ్లే సమయంలో సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి ప్రధాని మోడీ నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు కనిపించాయి.

సత్యాన్ని ప్రదర్శించడానికి సినిమా చేసిన ప్రయత్నాలకు ప్రధాని మోడీ ప్రశంసించారు. “ఈ నిజం బయటకు రావడం మంచిది, అది కూడా సాధారణ ప్రజలు చూసే విధంగా. ఒక నకిలీ కథనం పరిమిత కాలం వరకు మాత్రమే కొనసాగుతుంది. అంతిమంగా వాస్తవాలు ఎప్పటికీ బయటకు వస్తాయి! ” అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

ధీరజ్ సర్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశి ఖన్నా నటించారు. ఫిబ్రవరి 27, 2002న గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌కు సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని S-6 కోచ్‌లో జరిగిన విషాదకరమైన దుర్ఘటనకు సంబంధించిన విశేషాలను చిత్రంలో చూపించారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగి ఆదిత్యనాథ్, గోవాకు చెందిన ప్రమోద్ సావంత్‌తో సహా ముఖ్యమంత్రులు కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. కొన్ని రాష్ట్రాలు వీక్షకుల సంఖ్యను ప్రోత్సహించడానికి పన్ను రహితంగా చేయాలని నిర్ణయించాయి. ప్రముఖ నాయకులు మరియు నటీనటులు 2002 నాటి గోద్రా సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రధానంగా హైలెట్ అయ్యాయి.

ఇది  నా కెరీర్‌లో అత్యున్నత దశ: విక్రాంత్‌ మాస్సే

‘ది సబర్మతి రిపోర్ట్‌’ చిత్రాన్ని ప్రధాని మోదీ సమక్షంలో వీక్షించడంపై కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే హర్షం వ్యక్తం చేశారు.  ‘‘ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎంపీలతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించడం చాలా సంతోషంగా ఉంది. ఇదో ప్రత్యేక అనుభూతి. మాటల్లో వర్ణించలేను. ఇది నా కెరీర్‌లో అత్యున్నత దశ’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. నటి రాశీఖన్నా స్పందిస్తూ.. ‘‘ఇప్పటివరకు ఈ సినిమాను చాలా సార్లు చూశాం. కానీ, ప్రధాని మోదీ సమక్షంలో చూడడం చాలా స్పెషల్‌. ఇప్పుడు ఈ సినిమాను ప్రజలు మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

Tags:    

Similar News