Modi-Bill Gates: సాంకేతికతలో నిపుణుడిని కాకపోయినా ఆకర్షితుడినే
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’;
ఆధునిక సాంకేతికత, ప్రజలకు మధ్య అంతరాన్ని సూచించే డిజిటల్ విభజనను తాను దేశంలో అనుమతించనని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలలో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గెట్స్‌తో దిల్లీలోని తన అధికారిక నివాసంలో....ప్రధాని చాయ్ పే చర్చ నిర్వహించారు. కృత్రిమ మేధ-A.I, డిజిటల్ విప్లవం సహా పలు అంశాలపై చర్చించారు.
విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కృత్రిమ మేధ A.I, డిజిటల్ టెక్నాలజీ సహా పలు రంగాలపై మోదీ, బిల్‌గేట్స్ చర్చించారు. A.I ప్రయోజనాలపై ఎక్కువగా మాట్లాడుకున్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించుకున్నట్టు ప్రధాని తెలిపారు. కృత్రిమ మేధతో హిందీలో చేసిన తన ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించినట్టు చెప్పారు. నమో యాప్‌లో కృత్రిమ మేథ వినియోగం గురించి ప్రస్తావించారు. ఏఐ శక్తిమంతమైందే కానీ.. దాన్ని మ్యాజిక్ టూల్‌గా ఉపయోగిస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని మోదీ హెచ్చరించారు.భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా వినియోగించొచ్చనీ.. అయితే డీప్‌ఫేక్‌తో తన గొంతును కూడా అనుకరించారని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ, బిల్ గేట్స్ భారత్‌లో డిజిటల్ విప్లవం గురించి చర్చించారు. 'నమో డ్రోన్ దీదీ' పథకం గురించి బిల్ గేట్స్‌కు మోదీ వివరించారు. కొత్త సాంకేతికతలో భాగంగా తాను 'నమో డ్రోన్ దీదీ' పథకాన్ని ప్రారంభించాననీ అది చాలా విజయవంతంగా కొనసాగుతోందని ప్రధాని తెలిపారు. కొందరు సైకిల్ తొక్కడం రాని మహిళలు కూడా డ్రోన్లు ఆపరేట్ చేసే స్థాయికి ఎదిగారని ప్రధాని గుర్తు చేశారు. తాను మూడోసారి అధికారంలోకి వస్తే గర్భాశయ క్యాన్సర్‌పై స్థానిక పరిశోధన కోసం శాస్త్రవేత్తలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ప్రధాని తెలిపారు.కొవిడ్ సమయంలో ఎదురైనా సవాళ్లను బిల్‌గేట్స్‌తో పంచుకున్నారు.
సాంకేతికతలో నిపుణిడిని కాకపోయినా దానికి ఆకర్షితుడినయ్యానని మోదీ చెప్పారు. సాంకేతికత గురించి తెలుసుకోవాలని చిన్న పిల్లల్లా ఉత్సుకత కలిగి ఉంటానని తెలిపారు. చర్చ తర్వాత పోషకాహార పుస్తకాలను ప్రధాని మోదీకి బిల్‌గేట్స్ బహుమతిగా ఇచ్చారు.