Delhi: ఆత్మాహుతి దాడి కుట్ర భగ్నం.. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్
ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. ఐసిస్ ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. దీంతో మధ్యప్రదేశ్‌లో ఒకరు.. సౌత్ ఢిల్లీలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తులో ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ పేలుడుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడైంది. వీరిద్దరూ ఆత్మాహుతి మిషన్ కోసం శిక్షణ పొందుతున్నారని తేలింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ISISతో సంబంధం ఉన్న హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.
చాలా పగడ్బందీగా ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఛేదించినట్లుగా తెలుస్తోంది. పక్కా నిఘాతో భద్రతా సంస్థలు ఈ కుట్రను పసిగట్టాయి. పక్కా ప్రణాళికతో ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అనుమానితుల్లో ఒకరిని దక్షిణ ఢిల్లీ నుంచి అరెస్టు చేయగా.. రెండవ వ్యక్తిని మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు.