Pope Francis: మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం
శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పోప్;
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. శనివారం ఆయనకు తీవ్రమైన శ్వాస సమస్య వచ్చింది. దీంతో అధిక పీడనంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. 88ఏళ్ల పోస్ ఈనెల 14వ తేదీన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో రోమ్ లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. పరీక్షల తర్వాత ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు రక్తాన్ని మార్చారు. శుక్రవారం కంటే శనివారం మరింత కష్టంగా గడిచింది. ఈ సమయంలో ఏమీ చెప్పలేమని వాటికన్ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది.
పోప్ న్యూమోనియాతోపాటు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మరో వారం రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రమాదం నుంచి పోప్ బయటపడలేదని ఆయన వ్యక్తిగత ఫిజీషియన్ లూగీ కార్బొన్ తెలిపారు.
అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936లో జన్మించిన పోప్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. కాగా, దక్షిణార్థ గోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు.