Central cabinet: కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు...
కీలక రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చే అవకాశం;
వచ్చేవారంలో కేంద్ర కేబినెట్‌లో పెను మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కీలక రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురి గవర్నర్‌లను కూడా మార్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ గవర్నర్ తమిళిసైని మార్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసం 12 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు.ఈ నేపధ్యంలో సంస్థాగతంగా భారీ మార్పులు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.
టార్గెట్ ఫిక్స్ చేసిన ప్రధాని మోదీ మిషన్ 2024 దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. మంత్రివర్గ విస్తరణకు రెడీ అయిన మోదీ ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేశారు. ఐదు గంటల పాటు సుధీర్ఘంగా సాగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని మంత్రులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పలు అంశాలపై మంత్రివర్గ సహచరులతో ముక్కుసూటిగా మాట్లాడారు. కేబినెట్‌లో 10 నుంచి 15 మంది కొత్త వారికి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగే కొందరికి ఉద్వాసన పలికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల నుంచి పలువురికి కేంద్ర మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది.