Prajwal Revanna: జైల్లో లైబ్రరీ క్లర్క్‌గా ప్రజ్వల్ రేవణ్ణ
పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ..
మాజీ ప్రధాన మంత్రి హెచ్.డీ. దేవే గౌడ మనవడు, హాసన మాజీ JD(S) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన ఇంట్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో యావజ్జీవ శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్న అతడ్ని లైబ్రరీ క్లర్క్‌గా పనిని కేటాయించినట్లు జైలు అధికారులు తెలిపారు. తోటి ఖైదీలకు పుస్తకాలు జారీ చేయడం, వాటికి సంబంధించిన వివరాల రికార్డులను నిర్వహించడం లాంటివి చేయాలని పేర్కొన్నారు.
అయితే, ప్రతి పని దినానికి రూ.522 జీతంగా ప్రజ్వల్ రేవణ్ణకు అందజేస్తామని జైలు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక, జైలు నిబంధనల ప్రకారం.. జీవిత ఖైదు శిక్ష పడిన వారు జైల్లో ఏదో ఒక రకమైన పని చేయాల్సి ఉంటుంది.. వారి నైపుణ్యాలను బట్టి పనిని కేటాయిస్తామన్నారు. ఇక, ప్రజ్వల్ ఆఫీస్ వర్క్‌ను ఎంచుకోవడంతో లైబ్రరీ క్లర్క్‌గా పనిని కేటాయించాం.. జైల్లో ఖైదీలు సాధారణంగా నెలకు కనీసం 12 రోజులు, వారానికి మూడు రోజులు తప్పకుండా కష్టపడాల్సిందేనని నిబంధనలు ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు.
ఇక, గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో హాసన సెక్స్ స్కాం కర్ణాటకలో తీవ్ర దుమారం సృష్టించింది. అప్పుడు ఓ మహిళ షాకింగ్ విషయాలను తెలియజేసింది. తన తల్లిపై కొన్నేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకుంది. అనంతరం పలువురు మహిళలు ఆయనపై ఆరోపణలు చేయగా.. దర్యాప్తులో ప్రజ్వల్ దోషిగా తేలడంతో న్యాయస్థానం అతడికి యావజ్జీవ శిక్షను విధించింది.