Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ!
జన్ సురాజ్ పేరుతో అక్టోబర్ 2న ప్రారంభం;
మాజీ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిశోర్ త్వరలో రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. ప్రస్తుతం బీహార్‌లో నిర్వహిస్తున్న జన్ సురాజ్ ప్రచారాన్ని రాజకీయ పార్టీగా మారుస్తున్నామని, అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు తమ పార్టీని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. జన్ సురాజ్ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. బీహార్ ముఖచిత్రాన్ని మార్చడమే తమ పార్టీ ధ్యేయమని అన్నారు.
రెండేళ్ల క్రితం జన్ సురాజ్ ప్రచారాన్ని ప్రారంభించామని, గతంలో చెప్పిన విధంగానే దీనిని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు ఆయన తెలిపారు. పార్టీ నాయకత్వం, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్ పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. అలాగే ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌బలి సింగ్ చంద్రవంశీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు పార్టీలో చేరారు. కాగా, కోటి మంది తన పార్టీలో చేరుతారని ప్రశాంత్ కిశోర్ ఇటీవల ప్రకటించారు.
ప్రశాంత్ కిశోర్ గతంలో రాజకీయ వ్యూహకర్తగా పలు పార్టీల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి జేడీయూ పార్టీలో చేరారు. జేడీయూ జాతీయ ఉపాధ్యక్ష పదవిని కూడా చేపట్టిన ఆయన... ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పటినుంచి జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.