Droupadi Murmu: పాక్‌ తప్పుడు ప్రచారాలకు రాష్ట్రపతి చెక్.

పాకిస్థాన్‌ పట్టుకున్నామని ప్రకటించిన పైలట్‌తో ప్రయాణం

Update: 2025-10-29 23:39 GMT

 పాక్ తప్పుడు ప్రచారాలకు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెక్ పెట్టేశారు. బుధవారం రాఫెల్ ఫైటర్ జెట్‌లో 30 నిమిషాల పాటు విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌తో కలిసి ఫొటో దిగారు. గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని.. ఆ విమాన పైలట్ శివాంగి సింగ్‌ను యుద్ధ ఖైదీగా అదుపులోకి తీసుకున్నమని దాయాది దేశం తప్పుడు వార్తలు వ్యాప్తి చెందేలా చేసింది. ఈ వార్తలపై అప్పట్లో భారత్ స్పందించింది. ధీశాలి శివాంగి సింగ్‌ భారత్‌లో సేఫ్‌గా ఉందని తేల్చి చెప్పింది. పాక్ బూటకపు మాటలను తప్పికొట్టింది. అయితే.. తాజాగా ధీశాలి శివాంగి సింగ్ భారత్‌లో సురక్షితంగా ఉన్నారని దేశ మొదటి పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.

ఇంతకీ  ఎవరీ శివాంగి సింగ్  .?

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్ పాకిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ భారత్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చేశామని అసత్య ప్రచారాలు చేసింది. సిగ్గు లేకుండా భారత్ కు చెందిన ఒక మహిళా పైలట్ పట్టుబడ్డారని పాకిస్థాన్ సోషల్ మీడియాలో ఒక అబద్ధాన్ని వేగంగా ప్రచారం చేసింది. అయితే ఇది పచ్చి అబద్ధమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అప్పట్లోనే తేల్చి చెప్పింది.

శివంగి సింగ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత మొట్టమొదటి, ఏకైక మహిళా పైలట్. శివంగి సింగ్ 1995 మార్చి 15న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించారు. ఆమె తండ్రి హరిభూషణ్ సింగ్ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. ప్రస్తుతం ఆయన ఒక ప్రభుత్వ పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆమె తల్లి ప్రియాంక సింగ్ గృహిణి. శివాంగి ఒక సాధారణ కుటుంబానికి చెందినది. ఆమె ముత్తాత బాలికల విద్య కోసం తనకున్న భూమిని విరాళంగా ఇచ్చారు. శివాంగి తన ప్రాథమిక విద్యను వారణాసిలోనే చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బిటెక్ చేసింది. శివాంగి పైలట్ అయ్యే కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు తన గ్రామంలో ఒక రాజకీయ నాయకుడి హెలికాప్టర్ దిగిన సంఘటన ఆమెను పైలట్ కావడానికి ప్రేరణనిచ్చింది.

Tags:    

Similar News