President Droupadi Murmu: రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ పెట్టొచ్చా..?
ఆర్టికల్ 143 ఆధారంగా లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టును ప్రశ్నించిన రాష్ట్రపతి.;
ఇటీవల తమిళనాడు వ్యవహారంపై రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్ లైన్ విధిస్తూ ఇటీవలే సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్లు బిల్లులను ఆమోదించడంలో సమయపాలనకు లోబడి ఉండాలా..? అనే అంశంపై సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారు. ఇందుకోసం ఆమె భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ఆధారంగా సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా అభ్యర్థించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులు గవర్నర్‌కు పంపినప్పుడు, గవర్నర్ తనకు అందుబాటులో ఉన్న ఎంపికల్ని వాడే సందర్భంలో మంత్రివర్గం ఇచ్చిన సలహాను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనా అనే అంశంపై రాష్ట్రపతి ప్రశ్నించారు. అలాగే, గవర్నర్ నిర్ణయాలు న్యాయస్థానాల్లో విచారణకు లోబడతాయా అనే అంశంపై కూడా స్పష్టత కోరారు. అలాగే ఆర్టికల్ 361ని ప్రస్తావిస్తూ, గవర్నర్ లేదా రాష్ట్రపతి తమ అధికారాల వినియోగానికి సంబంధించి న్యాయస్థానాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనితోపాటు.. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి బిల్లులను ఆమోదించడంలో సమయం, విధానం రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పలేదన్న నేపథ్యంలో దీనిపై న్యాయస్థానాలు మార్గనిర్దేశం చేయగలవా అనే విషయాన్ని రాష్ట్రపతి ప్రశ్నించారు.
అసలేంటి తమిళనాడు తీర్పు..?
ఏప్రిల్‌లో జస్టిస్ జేబీ పడివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ లతో కూడిన బెంచ్ తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి 10 బిల్లులను ఆమోదించకపోవడాన్ని “అన్యాయమైనదిగా” పేర్కొంటూ మూడు నెలల గడువు నిర్ణయించింది. ఈ తీర్పులో రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించడమో.. లేక తిరిగి పంపాల్సి ఉంటే వాటిని నిర్ణీత సమయంలోపు ఆమోదించాలని సూచించింది.
అయితే, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి బిల్లులు రాజ్యాంగబద్ధమైనవా కాదా అన్న విషయాన్ని తేల్చడం మాత్రం న్యాయస్థానాల హక్కు. రాజకీయ విధానాలకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదు. ఏదైనా గవర్నర్ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు కేటాయించినా.. అది రాజ్యాంగ విరుద్ధత అనే న్యాయపరమైన కారణాలపైనే ఆధారపడాలనీ, అటువంటి సందర్భాల్లో రాష్ట్రపతి నిర్ణయాన్ని న్యాయస్థానం పునఃపరిశీలించవచ్చని పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ గవాయ్ నేతృత్వంలో బెంచ్ ఏర్పడుతుందా, లేక ఇప్పటికే ఇచ్చిన రెండు న్యాయమూర్తుల తీర్పును పునరుద్ఘాటిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.