Ratan Tata : దివికేగిన దిగ్గజ పారిశ్రామికవేత్త..

రాష్ట్రపతి, ప్రధానితో సహా ప్రముఖుల నివాళి;

Update: 2024-10-10 02:00 GMT

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రతన్‌ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దిగ్గజ వ్యాపారవేత్తకు నివాళి అర్పిస్తూ గురువారాన్ని సంతాప దినంగా ప్రకటించింది. అలాగే రతన్‌ టాటా మృతికి సంతాపం తెలుపుతూ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ గురువారం సంతాప దినం ప్రకటించారు. 

రతన్‌ టాటా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని, ఎంతో దయగల అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. భారత్‌లోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వం అందించారని, మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు. భారీ లక్ష్యాలను ఊహించడం, ఆ ప్రతిఫలాలను సమాజానికి తిరిగి ఇవ్వడం రతన్‌ టాటా నైజం. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రుద్ధ్యం, జంతు సంరక్షణ సేవల్లోనూ ఆయన ఎంతో ముందుండేవారు. దేశంలోనే ఘన చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక వ్యాపార సామ్రాజ్యమైన టాట్‌ గ్రూప్‌నకు రతన్‌ ఎంతో స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. బోర్డ్‌ రూం కార్యాకలాపాలకు మించి దేశానికి అమూల్య సేవలందించారని గుర్తుచేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆయన ధోరణి ఆచరణాత్మకమని, దయార్ద్ర హృదయంతో మెరుగైన సమాజం కోసం అనుక్షణం తపించే వారిని ప్రధాని కొనియాడారు.

రతన్‌ టాటా మృతిపట్ల ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సంతాపం వ్యక్తం చేశారు. అత్యున్నతమైన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు ఆయన మార్గదర్శి అని అన్నారు.

రతన్‌ టాటా మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్‌ టాటా శాశ్వత ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్​, రతన్​ టాటా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారరంగంలో రతన్ టాటా అసాధారణమైన సేవలు అందించారని పేర్కొన్నారు. రతన్‌ టాటా లేరన్నది నేను అంగీకరించలేకపోతున్నానని ఆనంద్‌ మహీంద్రా అన్నారు. మన దేశ ఆర్థిక సంపదకు, విజయాలకు ఆయన సేవలు ఎంతగానే ఉపయోగపడ్డాయని కొనియాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో కీలమని పోస్టు చేశారు.ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో రతన్‌ టాటా ప్రసిద్ధి చెందారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా మృతిపట్ల కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపింద్ర పటేల్‌, ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News