New Delhi: నలుగురిని రాజ్యసభకు నామినేట్‌ చేసిన రాష్ట్రపతి…

శుభాకాంక్షలు తెలిపిన మోదీ..!;

Update: 2025-07-13 07:30 GMT

రాజ్యసభకు నలుగురిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్‌ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికం, మాజీ దౌత్యవేత హర్ష్‌వర్ధన్‌ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్‌ మీనాక్షి జైన్‌తో పాటు కేరళకు చెందిన సామాజికవేత్త, ఉపాధ్యాయుడు సదానంద్‌ మాస్టర్‌ను రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నలుగురు వివిధ రంగాల్లో విశేష సేవలను గుర్తించి పెద్దలకు సభకు నామినేట్‌ చేశారు. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం ఉంటుంది. కళలు, సాహిత్యం, సామాజిక సేవ తదితర రంగాల్లో అందించిన సేవలను గుర్తించి నామినేట్‌ చేస్తుంటారు.

న్యాయరంగంలో ఉజ్వల్‌ నికం సేవలు..

ఉజ్వల్‌ నికం దేశంలో ప్రముఖ న్యాయవాదుల్లో ఆయన ఒకరు. ఆయన కీలకమైన కేసులను వాదించారు. 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసు విచారణ, ఇతర హై-ప్రొఫైల్ క్రిమినల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసును సైతం వాదించి.. దోషులకు శిక్షలు పడేలా చేశారు. న్యాయ వ్యవస్థపై ఆయనకున్న నిబద్ధత, నిశితమైన వాదన సామర్థ్యం దేశానికి ఎంతో ప్రఖ్యాతిని తీసుకువచ్చాయి. ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున తరఫున ముంబయి నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓటమిపాలయ్యారు.

మాజీ దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా

హర్ష్ వర్ధన్ భారత మాజీ విదేశాంగ కార్యదర్శి. అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్‌ రాయబారిగా విధులు నిర్వర్తించారు. ఆయన సీనియర్‌ దౌత్యవేత్త. అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానంలో ఆయనకు అనుభవం ఉన్నది. విదేశాంగ కార్యదర్శిగా ఆయన పదవీ కాలంలో అనేక కీలకమైన దౌత్యపరమైన సంప్రదింపుల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ స్థానాన్ని పటిష్టం చేయడంలో గణనీయమైన కృషి చేశారు. 2023లో భారతదేశ జీ20 ప్రెసిడెన్సీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా సేవలందించారు.

సీ సదానందన్‌ మాస్టర్‌..

కేరళకు చెందిన సీ సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. సామాజిక కార్యకర్తగా, బీజేపీ నేతగా సవలందిస్తున్నారు. 1994లో సీపీఎం నేతల దాడిలో ఆయన రెండు కాళ్లను కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున బరిలోకి దిగారు.

మీనాక్షి జైన్

మీనాక్షి జైన్ ప్రముఖ చరిత్రకారిణిగా గుర్తింపు పొందారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. విద్యారంగంలో ఆమె చేసిన కృషికి 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగా పని చేశారు. భారతీయ సంస్కృతి, సామాజిక అంశాలపై ఆమె చేసిన లోతైన పరిశోధనలు, రచనలు విద్యా రంగంలో ఆమెకు విశేష గౌరవం తెచ్చిపెట్టాయి. ఆమె రచించిన అనేక పుస్తకాలు చారిత్రక పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో, భారతీయ వారసత్వాన్ని అర్థం చేసుకోవడంలో దోహదపడ్డాయి.

శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ

రాజ్యసభకు నామినేట్‌ అయిన నలుగురు ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, 26/11 ముంబై ఉగ్రవాద దాడి కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్, కేరళ బీజేపీ నేత సీ సదానందన్ మాస్టర్, చరిత్రకారిణి మీనాక్షి జైన్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు

Tags:    

Similar News