Netanyahu: ఇక పాలస్తీనా దేశం ఉండదు: తేల్చిచెప్పిన ఇజ్రాయెల్
ప్రధాని నెతన్యాహు కార్యాలయం అధికారికంగా వెల్లడి
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. జోర్డాన్ నదికి పశ్చిమ ప్రాంతంలో పాలస్తీనా దేశం అనేదే ఉండబోదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా అధికారికంగా వెల్లడించింది. పాలస్తీనా దేశ ఏర్పాటుకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమం తర్వాత, తమ దేశం మధ్యలో బలవంతంగా ఒక ఉగ్రవాద రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని నెతన్యాహు ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న దేశాలకు ఇది తమ నుంచి స్పష్టమైన సందేశం అని పేర్కొంది. ఈ నెలాఖరులో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు నెతన్యాహు అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటన నుంచి తిరిగి వచ్చాక దీనిపై పూర్తిస్థాయిలో స్పందిస్తామని, కీలక ప్రకటన ఉంటుందని ప్రధాని కార్యాలయం తెలిపింది.
ఆసక్తికరంగా, ఈ పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నెతన్యాహుకు ఫోన్ కాల్ ద్వారా ఆహ్వానం అందింది. మరోవైపు, ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా దేశ ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నట్టు బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా ఇప్పటికే బాహాటగంగా ప్రకటించాయి.
గత ఏడాది అక్టోబర్‌లో హమాస్ జరిపిన దాడిలో అనేక మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోగా, 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.