Maharashtra కాంగ్రెస్‌పై మోడీ సంచలన వ్యాఖ్యలు -అదో పరాన్నజీవి పార్టీ-మోదీ

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు;

Update: 2024-11-24 01:15 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి బంపర్ విజయం, యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్రలో ఓట్లు పొందేందుకు వీర్ సావర్కర్‌పై తప్పుడు ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ తాత్కాలికంగా నిలిపివేసిందని ప్రధాని పేర్కొన్నారు. “కాంగ్రెస్ ఇప్పుడు భారత రాజకీయాల్లో పరాన్నజీవిగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. యూపీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు.” అని ప్రధాని తెలిపారు. ‘ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం (ఏక్‌ హై తో సేఫ్‌ హై..)’ అనే నినాదమే ఇప్పుడు దేశానికి మహా మంత్రంగా మారిందని చెప్పారు.

కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీగా మారిందని మోడీ తెలిపారు. “తన పడవను మాత్రమే కాకుండా తన సహచరులను కూడా ముంచుతోంది. మహారాష్ట్రలో కూడా ఇదే చూశాం. అక్కడ కాంగ్రెస్, దాని కూటమిలోని పార్టీలు ప్రతి ఐదు సీట్లలో నాలుగు ఓడిపోయాయి. కాంగ్రెస్‌ మునిగిపోతూ.. ఇతరులను కూడా ముంచుతుందని దీన్నిబట్టి తెలుస్తోంది. అధిక స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ తన మిత్రపక్షాలను కూడా దెబ్బతీసింది. యూపీ వంటి రాష్ట్రాల్లోని కాంగ్రెస్ మిత్రపక్షాలు కాంగ్రెస్‌ను రక్షించడం విశేషం.

కాంగ్రెస్ అర్బన్ నక్సలిజం దేశానికి సవాల్‌గా మారిందని, దాని రిమోట్‌ కంట్రోల్‌ దేశం వెలుపల ఉందని విమర్శించారు. అధికారం కోసం దురాశతో కులతత్వం అనే విషాన్ని వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్రలో అస్థిరతను సృష్టించేందుకు యత్నించిన, ద్రోహానికి పాల్పడిన కొందరిని ఓటర్లే శిక్షించారని ప్రధాని అన్నారు. దేశానికి ప్రథమస్థానం ఇచ్చేవారితోనే తప్ప కుర్చీకి ప్రాధాన్యం ఇచ్చేవారితో ఓటర్లు ఉండరని వ్యాఖ్యానించారు.

మన రాజ్యాంగ నిర్మాతలు హిందూ విలువలు, సంప్రదాయాలను పాటిస్తూనే సెక్యులరిజం మార్గాన్ని ఎంచుకున్నారని ప్రధాని మోడీ అన్నారు. అందుకే దేశంలోని మహానుభావులు రాజ్యాంగ పరిషత్‌లో చర్చించారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ కుటుంబం మాత్రం ఆ గొప్ప సంప్రదాయాన్ని తప్పుడు సెక్యులరిజం పేరుతో నాశనం చేసిందన్నారు. కాంగ్రెస్‌ వేసిన బుజ్జగింపుల బీజం రాజ్యాంగ నిర్మాతలకు చేసిన పెద్ద ద్రోహమని నొక్కి చెప్పారు.

మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన చోట మెజార్టీ సీట్లు బీజేపీ కూటమి గెలుచుకోవడం పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర చారిత్రక విజయం, ప్రధాని మోదీ సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తమయ్యాయన్నారు. ఈ గెలుపు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా చేసిందన్నారు. ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు... మోదీ ప్రజాసేవకు ఫలితం అన్నారు.

Tags:    

Similar News