Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ..
నిబంధనలు పౌరులను ఇబ్బంది పెట్టడానికి కాదని వ్యాఖ్య
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. పైలట్లు అందుబాటులో లేక విమానాలు ఆలస్యం కావడం, రద్దు కావడం జరిగిందని అధికారులు చెబుతుండగా.. డీజీసీఏ రూల్స్ వల్లే ఇబ్బంది కలిగిందనే ఆరోపణలు వినిపించాయి. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పైలట్ల విశ్రాంతికి సంబంధించిన నిబంధనలను డీజీసీఏ సడలించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
మంగళవారం ఉదయం ఎన్డీయే నేతలతో జరిగిన భేటీలో ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రధాని ప్రస్తావించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకొచ్చే నిబంధనలు వ్యవస్థలను మెరుగుపరిచేలా ఉండాలే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టేలా వుండకూడదని ప్రధాని వ్యాఖ్యానించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మోదీ చెప్పారన్నారు. ‘‘నియమ నిబంధనలు మంచివే.. అయితే, అవి వ్యవస్థలను మెరుగుపరచాలి, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు” అని మోదీ అన్నట్లు రిజిజు తెలిపారు.