Swami Sivananda : ప్రముఖ యోగా గురువు శివానంద స్వామి కన్నుమూత

ప్రధాని మోదీ సంతాపం;

Update: 2025-05-04 08:00 GMT

 ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద కన్నుమూశారు. వారణాసి  లోని తన నివాసంలో స్వామి తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ప్రస్తుతం శివానంద స్వామి వయసు 128 సంవత్సరాలు. 1896 ఆగస్టు 8న అవిభక్త భారత్‌లోని సిల్హెత్ జిల్లాలో, నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. ప్రస్తుతం సిల్హెత్‌ జిల్లా బంగ్లాదేశ్‌లో ఉంది.

శివానంద స్వామికి ఆరేళ్ల వయసులోనే ఆయన తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో ఆయన పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేయడమేగాక, యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసిన స్వామి శివానంద.. గత 50 ఏళ్లుగా పూరిలో 400-600 కుష్టు రోగులకు సేవచేశారు.

యోగా రంగానికి ఆయన చేసిన కృషికిగాను 2022లో శివానంద అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తెల్లటి ధోవతి, కుర్తా ధరించి.. కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.

స్వామి శివానంద మృతిపట్ల ప్రధాని  నరేంద్ర మోదీ  సంతాపం ప్రకటించారు. స్వామి శివానంద మృతి తనను చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.

Tags:    

Similar News