Jamia Millia Islamia: పరీక్ష పత్రంలో వివాదాస్పద ప్రశ్నే .. జామియా ప్రొఫెసర్ సస్పెన్షన్..
విచారణకు కమిటీ ఆదేశం
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ పరీక్షా పత్రం వివాదానికి దారితీసింది. సామాజిక సమస్యలపై అడిగిన ఒక ప్రశ్న అభ్యంతరకరంగా ఉందన్న ఆరోపణలతో ప్రొఫెసర్ వీరేంద్ర బాలాజీ షహారేను యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.
ఈ వారం ప్రారంభంలో జరిగిన బీఏ (ఆనర్స్) సోషల్ వర్క్ మొదటి సెమిస్టర్ పరీక్షలో 'భారతదేశంలో సామాజిక సమస్యలు' అనే పేపర్‌లో ఒక ప్రశ్న ఇచ్చారు. అందులో "భారతదేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాల గురించి తగిన ఉదాహరణలతో చర్చించండి" అని 15 మార్కుల ప్రశ్నను అడిగారు.
ఈ ప్రశ్నపత్రం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇది ఒక వర్గాన్ని కించపరిచేలా లేదా రాజకీయ ప్రేరేపితంగా ఉందని పలువురు విమర్శించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా కూడా దీనిపై స్పందిస్తూ.. జామియా వంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఇటువంటి ప్రశ్నలు అడగడం వెనుక దురుద్దేశం ఉందని మండిపడ్డారు.
విషయం తీవ్రతను గుర్తించిన యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే చర్యలు చేపట్టింది. ఫ్యాకల్టీ సభ్యుడి నిర్లక్ష్యం, అజాగ్రత్తను తీవ్రంగా పరిగణిస్తూ ప్రొఫెసర్ షహారేను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెండ్ చేసింది. ఈ ప్రశ్నను ఎలా రూపొందించారు? అది నిబంధనలకు విరుద్ధమా? అన్న కోణంలో విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
మొదట ప్రొఫెసర్‌పై పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని, కేవలం అంతర్గత విచారణ మాత్రమే జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. యూనివర్సిటీ గౌరవాన్ని, క్రమశిక్షణను కాపాడటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్ షేక్ సఫీవుల్లా సంతకం చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రొఫెసర్‌పై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.