Rich Dogs: కోటేశ్వరులైన కుక్క గారు
వీధి కుక్కల రాజభోగాలు.. రూ.90 కోట్ల మేర ఆస్తులు;
ఆ ఉరిలో కుక్కలు కుక్కలు కావు మహారాజులు. పేరుకి వీధి కుక్కలే అయినా అవి కోట్లకు పడగలెత్తాయి. ఏకంగా రూ.90 కోట్ల ఆస్తికి హక్కుదారులయ్యాయి. ఆ ఆస్తి నిర్వహణకు ఓ ట్రస్టు కూడా ఉంది. దీంతో ఆ గ్రామసింహాలు, సింహాలలాగ రాజసంగా మారిపోయాయి.
సాధారణంగా విదేశాల్లో చాలామంది పెంపుడు కుక్కలు, పిల్లుల పేరిట తమ కోట్ల రూపాయల ఆస్తి రాసేశారని వింటుంటాం. కానీ మనదేశంలో గుజరాత్ మెహసానా జిల్లా పంచోత్ గ్రామంలో కూడా శునకాలకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. జంతువులకు సేవ చేస్తే మంచి జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ఆ నమ్మకంతోనే వీధి కుక్కల బాగోగుల కోసం ఏకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. కొందరైతే తమ కోట్ల రూపాయల విలువైన భూమిని ఆ ట్రస్ట్ పేరిట రాసిచ్చారు. వాటి విలువ 90 కోట్ల పై మాటే..ఆ భూములను మళ్ళీ గ్రామంలోని రైతులకే కౌలుకు ఇస్తారు. ఆ కౌలు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ శునకాలపోషణ, బాగోగుల కోసం ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతానికి ఈ శునకాల ట్రస్టు పేరిట పదెకరాల భూమి ఉంది. దాని ఆ విలువ 90కోట్లు.
ఈ కుక్కల సేవ కోసం భారీ యంత్రాంగమే ఏర్పాటు చేసుకున్నారు. ట్రస్ట్ డబ్బులతో జీతాలు కూడా ఇస్తుండటం తో కుక్కలకు సేవ చేసి జీతం తీసుకోవడానికి ఇక్కడి యువత కూడా శ్రద్ద పెడుతున్నారు.
ఈ రిచ్ డాగ్స్ పేరుకు తగ్గట్టుగానే రాజభోగం అనుభవిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వాటికి రొట్టెలు తయారు చేయడానికి ట్రస్టు కొంత మంది మహిళలను నియమించింది. వాళ్ళు రోజుకు వెయ్యి రొట్టెలను తయారు చేస్తే, వాలంటీర్ల బృందాలు వాటిని తీసుకెళ్లి శునకాలకు పెడతారు.
అంతే కాదు ఈ గ్రామ సింహాలు అనారోగ్యం పాలైనప్పుడు, లేదా గాయపడినప్పుడు వాటికి వైద్యం చేసేందుకు ఓ పశు వైద్యుడిని కూడా ఈ ట్రస్ట్ నియమించింది. దీంతో వీటికి 24 గంటల పాటు వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది. శునకాలే మెయిన్ అయినా వాటితో పాటు ఇతర పశువుల బాగోగులను కూడా ఈ ట్రస్టు చేపడుతోంది. భవిష్యత్తు లో పక్షుల కోసం గూళ్లు కూడా నిర్మించాలని ఈ ట్రస్టు ప్లాన్ చేస్తోంది.