ఇటీవల బంగ్లాదేశ్ అల్లర్లను ఉద్దేశిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తన నిరసనను దౌత్యమార్గాల ద్వారా తెలియజేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం చెప్పింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంగ్లాదేశ్ వైపు నుండి మాకు దౌత్యపరమైన నోట్ అందిందని నేను ధృవీకరించగలను అని ఎంఈఎ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం తెలిపారు. విదేశీ వ్యవహారాలు కేంద్రం పరిధిలోకి వచ్చే అంశమని ఆయన చెప్పారు.
జూలై 21న కోల్కతాలో జరిగిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆశ్రయం కోరే బంగ్లాదేశీయులకు బెంగాల్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుందని ఆమె అన్నారు. హింస నుంచి వచ్చే శరణార్థులను, పొరుగు దేశాల వారిని గౌరవించాలని, వారికి వసతి కల్పించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం ఉందని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.