Maharashtra : మళ్లీ ఊపందుకున్నమరాఠా రిజర్వేషన్ల ఉద్యమం..

పోలీసుల లాఠీచార్జి పై ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ క్షమాపణ;

Update: 2023-09-06 12:00 GMT

మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ తీవ్రమవుతోంది. మూడు రోజుల క్రితం జాల్నా జిల్లాలో పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పుణె జిల్లాలోని బారామతి పట్టణంలో వివిధ మరాఠా సంఘాలు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇప్పటివరకు 20కిపైగా బస్సులను ఆందోళనకారులు దగ్ధం చేశారు.పలు చోట్ల ఘర్షణలు చెలరేగుతుండటంతో మహారాష్ట్రలోని 250 బస్సు డిపోలలో 45 డిపోలను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పరిధిని ప్రస్తుతం ఉన్న 50 శాతానికి అదనంగా మరో 15 నుంచి 16 శాతం పెంచాలని శరద్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు. ఆందోళనకు దిగిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి జరపడంపై ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారంనాడు క్షమాపణ చెప్పారు.


మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అహ్మద్‌నగర్‌, ఔరంగాబాద్‌, పర్భని, హింగోలి, జల్నా, నాందేడ్‌, ధారాశివ్‌ జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, బంద్‌లతో ఆయా జిల్లాలు అట్టుడుకుతున్నాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ప్రభావిత ప్రాంతాల్లోని 46 బస్సు డిపోలను మూసివేశారు. మహారాష్ట్రలో 250 డిపోలు ఉండగా అందులో 46 డిపోల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేశంలోని అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థల్లో ఒకటైన MSRTCకి 14 కోట్ల నష్టం వచ్చింది.  20 బస్సులను ఆందోళనకారులు దగ్ధం చేశారు. మరో 19 బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మరాఠాలకు రిజర్వేషన్‌ కల్పించాలంటూ నాందేడ్‌ జిల్లాలో సోమవారం జరిగిన భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ర్యాలీ ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. శుక్రవారం జాల్నాలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ వజీరాబాద్‌ ప్రాంతంలో నిరసనకారులు దుకాణాలపై రాళ్లు రువ్వారు. మరాఠాలకు రిజర్వేషన్‌లు కల్పించాలంటూ పలువురు రాజకీయ ప్రముఖులు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.  2018లో ఫడణవీస్‌ సీఎంగా ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. ఆ నిర్ణయాన్ని ముంబయి హైకోర్టు సమర్థించగా.. 2021లో సుప్రీం కోర్టు వ్యతిరేకించింది. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. దీంతో ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.  

Tags:    

Similar News