Ravinder Negi: దీపావళి రోజున తల్లిని 16 సార్లు పొడిచి, గొంతుకోసి చంపిన తనయుడు

నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తింపు

Update: 2025-10-22 03:45 GMT

దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగివున్న వేళ చండీగఢ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకే కాలయముడై తన తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెక్టార్ 40లో నివసిస్తున్న 60 ఏళ్ల సుశీల అనే మహిళను ఆమె కొడుకు రవీందర్ నేగి అలియాస్ రవి  కత్తితో పొడిచి చంపాడు.

దీపావళి రోజు ఉదయం 7 గంటల సమయంలో సుశీల ఇంట్లో నుంచి గట్టిగా కేకలు వినిపించాయని పొరుగున ఉంటున్న ఆకాశ్ బెయిన్స్ పోలీసులకు తెలిపారు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేసరికి ఇంటికి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. వారు టెర్రస్ పైనుంచి ఇంట్లోకి ప్రవేశించి చూడగా, రవి చేతిలో కత్తితో పారిపోవడం కనిపించింది. లోపల సుశీల రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 112కు సమాచారం అందించారు.

సెక్టార్ 39 పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంగళవారం నిర్వహించిన పోస్టుమార్టంలో సుశీలను 16 సార్లు కత్తితో పొడిచినట్లు తేలింది. నిందితుడు రవి పంజాబ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడని, గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. గతంలో అతడికి ఆసుపత్రిలో చికిత్స కూడా అందించారు.

భార్య, కూతురు అతనికి దూరంగా ఉంటుండటంతో, ఆరు నెలల క్రితం తల్లి వద్దకు వచ్చి ఉంటున్నాడు. ఘటన జరిగిన వెంటనే పారిపోయిన రవిని హర్యానా పోలీసుల సహాయంతో అదే రోజు సోనిపట్‌లో అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. 

Tags:    

Similar News