Pune Porsche accident: తాత ఇచ్చేన బర్త్డే గిఫ్ట్ తోనే మనవడు ఆక్సిడెంట్ , కాంగ్రెస్ వినూత్న నిరసన
డబ్బు , పలుకుబడితే బ్లడ్ శాంపిల్ మార్పు, ఫోరెన్సిక్ వైద్యులు అరెస్ట్;
పుణెలో మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపి ఇద్దరు టెకీల మృతికి కారణమైన మైనర్ బాలుడిని రక్షించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు జరిగాయి. చివరకు తమ పలుకుబడితో మైనర్ కుటుంబం వైద్యులను కూడా ప్రలోభ పెట్టారు. ఘటనా సమయంలో బాలుడి రక్తంలో ఆల్కహాల్ లేదని తప్పుడు నివేదిక ఇచ్చిన ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్ర పుణెలో టీనేజర్ పోర్ష్ కారు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో అనుకోని ట్విస్ట్‌ను క్రైంబ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనా పరీక్ష నివేదికను ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు గుర్తించి వారిపై చర్యలు మొదలుపెట్టారు. సాసూన్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అజేయ్ తావ్రే, డాక్టర్ శ్రీహరి హార్నూర్‌ను అరెస్టు చేశారు. పుణె ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ తావ్రే ఫోరెన్సిక్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన మొదట్లో అబ్జర్వేషన్ హోమ్‌లో ఉన్న బాలుడి రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాలు లేవని నివేదిక ఇచ్చారు. కానీ, పోలీసులు అనుమానంతో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా నిందితుడు మిత్రులతో కలిసి మద్యం తాగినట్లు ధ్రువీకరించుకొన్నారు. రక్త పరీక్షల సమయంలో మైనర్ నమూనాలను పారేసి మరొకరి నమూనాలను వీరు అక్కడ పెట్టినట్లు అనుమానిస్తున్నారు.
నిందితుడి తండ్రి బడా రియల్టర్ కావడంతో కేసును తప్పుదోవ పట్టించేందుకు చాలా యత్నాలే జరిగాయి. వారి డ్రైవర్‌ను ఈ కేసులో ఇరికించేందుకు నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్‌తో పాటు తాత తీవ్ర స్థాయిలో యత్నించినట్లు గుర్తించారు. డ్రైవర్‌ను ఇంట్లో బంధించి కేసు తనపై వేసుకోవాలని బెదిరించారు. అంతేకాక.. కొందరు పోలీసులను కూడా ప్రభావితం చేసినట్లు ఆరోపణలు రాగా.. ఇద్దరిపై వేటు పడింది..
మరోవైపు అధికార ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. కారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో వ్యాస రచన పోటీని నిర్వహించింది. ‘ఒకవేళ మా నాన్న బిల్డర్ అయితే?’, ‘ఆల్కహాల్ వల్ల కలిగే దుష్పరిణామాలు’ ‘అధికార వ్యవస్థ నిద్ర పోతోందా?’ వంటి అంశాలపై వ్యాస రచన పోటీ నిర్వహించింది. ఆదివారం నిర్వహించిన ఈ పోటీకి సుమారు 100 మంది హాజరయ్యారు. ఆకట్టుకునేలా వ్యాసం రాసిన వారికి రూ.11వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు చొప్పున బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపరు. ఈ వ్యాసాలను పూణే పోలీసుల కమిషనరుకు పంపుతామని తెలిపారు.