Punjab: పంజాబ్‌లో ఆసక్తి రేపుతున్న పార్టీల పొత్తు.. మొత్తం మూడు పార్టీలు..
Punjab: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు అప్పుడే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.;
Punjab: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు అప్పుడే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలిచి పంజాబ్‌లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ట్రయాంగిల్ స్కెచ్‌తో రంగంలోకి దిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ మాజీ నేత సుఖ్దేవ్సింగ్దిండ్సాతో కూటమి ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.
సోమవారం ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అమరీందర్ సింగ్, దిండ్సా సమావేశమయ్యారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం, అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల పంపకాలపైనా సుధీర్ఘంగా చర్చించారు. బీజేపీ, అమరీందర్ సింగ్, దిండ్సా పార్టీల మధ్య పొత్తు కొలిక్కి వచ్చిందని అమిత్ షా తెలిపారు.
పంజాబ్లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌తో కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సీట్ల పంపకాల కోసం ప్రతి పార్టీ నుంచి ఇద్దరు నేతలతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలో మరోసారి భేటీ అయి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని పంజాబ్ బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్గజేంద్ర సింగ్ షెఖావత్ తెలిపారు.
మరోవైపు.. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ ఇప్పటికే జోరు పెంచాయి. వీటికి తోడు రైతు సంఘాలు సైతం ఈసారి జరిగే పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. దీంతో ముందస్తు వ్యూహాలకు పదును పెట్టిన బీజేపీ.. పంచముఖ పోరు తప్పదని భావిస్తోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్, దిండ్సా బీజేపీతో చేరటం వల్ల రాష్ట్రంలో సిక్కుల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి పంజాబ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలం పార్టీకి పొత్తులు, ఎత్తులు ఏమేరకు కలిసొస్తాయనేది చూడాలి.