Religious Conversion: గురునానక్ జన్మస్థలం దర్శనానికి వెళ్లి, మతం మారి పెళ్లి
పాకిస్తాన్‌లోని గురునానక్ జన్మస్థలానికి వెళ్లిన పంజాబ్ మహిళ..
పాకిస్తాన్‌కు వెళ్లి తప్పిపోయిన మహిళ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ సందర్భంగా పాకిస్తాన్ పర్యటన సందర్భంగా కనిపించకుండాపోయిన సిక్కు మహిళ సరబ్జీత్ కౌర్(52) ఇస్లాం మతంలోకి మారి పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. పంజాబ్ లోని కపుర్తాలకు చెందిన సరబ్జిత్, ఇతర సిక్కు యాత్రికులతో కలిసి గురునానక్ దేవ్ 555వ జయంతి కోసం నవంబర్ 4న లాహోర్ సమీపంలో ఉన్న నాంకానా సాహిబ్ క్షేత్రానికి వెళ్లింది. అయితే, నవంబర్ 13న 1900 మందికి పైగా యాత్రికులు తిరిగి భారత్ కు వచ్చారు. ఇందులో సరబ్జిత్ కౌర్ లేదు.
దీని తర్వాత, పాకిస్తాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె ఎగ్జిట్ క్లియరెన్స్ కోసం రిపోర్ట్ చేయలేదని చెప్పారు. విచారణ జరపగా ఆమె పాకిస్తాన్‌లో ఇస్లాంలోకి మారిందని, అక్కడే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఉర్దూలో ఆమెకు సంబంధించిన (ఇస్లామిక్ వివాహ ఒప్పందం) నిఖానామా కాపీ బయటపడింది. లాహోర్ సమీపంలోని షేఖ్‌పునా నివాసి నాసిర్ హుస్సేన్ ను పెళ్లి చేసుకుంది. ఇస్లాం మతంలోకి మారి ఆమె పేరును ‘‘నూర్’’గా మార్చుకుంది.
52 ఏళ్ల మహిళ విడాకులు తీసుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఆమె గ్రామంలో మరింత ఎంక్వైరీ చేయగా, ఆమె మాజీ భర్త కర్నైల్ సింగ్ 30 ఏళ్లుగా యూకేలో నివసిస్తున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పంజాబ్ లోని ముక్త్‌సర్ జిల్లా నుంచి జారీ అయిన ఆమె పాస్‌పోర్టులో ఆమె మాజీ భర్త పేరు కాకుండా ఆమె తండ్రి పేరు ఉంది.